
దుర్గమ్మకు రేపు గాజుల అలంకరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం పది లక్షల గాజులతో అలంకరించనున్నారు. భగిని హస్త భోజనం (యమ ద్వితీయ)ను పురస్కరించుకుని ఏటా కార్తిక మాసంలో అమ్మవారికి గాజులతో విశేషంగా అలంకరిస్తారు. అమ్మవారి గాజుల ఉత్సవాన్ని పురస్కరించుకుని గాజుల దండలను సేవా సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. మహామండపం ఆరో అంతస్తులో సుమారు రెండువందల మంది సేవ సిబ్బంది ఉత్సవానికి అవసరమైన గాజుల దండలను తయారు చేస్తున్నారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం భక్తులు, ఉభయదాతలు సమర్పించిన గాజులకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ మంగళవారం పూజా కార్యక్రమాలు చేశారు. మంగళవారం సాయంత్రానికి సుమారు ఐదు లక్షల గాజులను భక్తులు సమర్పించారని, మిగిలిన గాజులను దేవస్థానం కొనుగోలు చేస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని గాజుల దండలతో అలంకరిస్తారు. అమ్మవారికి ఆలకరించిన గాజులను ఉత్సవం అనంతరం భక్తులకు పంపిణీచేస్తారు.

దుర్గమ్మకు రేపు గాజుల అలంకరణ