
మల్లేశ్వరా.. మనసాస్మరామి..!
నేటి నుంచి పెదకాకాని శివాలయంలో కార్తిక పూజలు
పెదకాకాని: దక్షిణకాశీగా విరాజిల్లుతున్న శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కార్తికమాస పూజలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు వేడుకలు నిర్వహించేందుకు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏర్పాట్లపై ఆయన మాట్లాడుతూ.. అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వరకు పూజలు జరుగుతాయన్నారు. లోకకళ్యాణార్థం ఆలయంలో నిత్యం ఉదయం మహన్యాసపూర్వక రుద్ర జపం, రుద్రహోమం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు అష్టోత్తర పూజ జరుగుతుందని తెలిపారు. 9 గంటలకు రుద్రహోమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్తిక మాసంలో పరోక్ష అభిషేక పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిప్రాతమైన కార్తికమాసంలో భక్తులు రూ. వెయ్యి చెల్లించి పాల్గొంటే కార్తికమాసం అనంతరం స్వామివారి ప్రసాదంగా శేషవస్త్రం, పంచకజ్జాయ ప్రసాదము వారి చిరునామాకు పోస్టు ద్వారా అందిస్తామన్నారు. నిత్యాభిషేక పథకంలో చేరిన భక్తులకు కార్తికమాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజులు మినహా ఇతర రోజుల్లో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల సేవలు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. కార్తిక పౌర్ణమి పర్వదినం రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కార్తిక పర్వదినాలలో ప్రత్యేక పూల అలంకారం, విద్యుత్ కాంతులతో అలంకరణ ఉంటాయని డీసీ వివరించారు.

మల్లేశ్వరా.. మనసాస్మరామి..!