
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
బాపట్ల: ప్రధానమంత్రి ఆదర్శ యోజన కింద గుర్తించిన గ్రామాలను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఎస్సీలు అధికంగా ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఆ మేరకు 18 మండలాలలో 59 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. గ్రామానికి రూ.20 లక్షల వంతున కేంద్రం కేటాయించిందని పేర్కొన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల విషయంలోనూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. మీ సేవ నగదు చెల్లింపులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు.
అన్నా క్యాంటీన్ పరిశీలన
అన్నా క్యాంటీన్‌లో ప్రజలకు రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక సూర్యలంక రోడ్‌లోని క్యాంటీన్‌ను ఆయన తనిఖీ చేశారు. మెనూ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ డీఈ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణ పాల్గొన్నారు.
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
అధిక మోతాదులో ఎరువులు వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీక్షణ సమావేశం మందిరంలో ఆయన జిల్లాస్థాయి భూమాత రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఏఏఓ అన్నపూర్ణ, గుంటూరు జెడ్పీ డిప్యూటీ సీఈవో కృష్ణ, టౌన్ డీఎస్పీ రామాంజనేయులు, ఇతర కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
యువతలో నైపుణ్యం పెంపు ముఖ్యం
యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ నిరంతరం కొనసాగాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. డీఆర్‌డీఏ అనుబంధంగా సి– డాప్ శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమం సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి రాజారావు, డీఆర్‌డీఏ పి.డి. లవన్న, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి మాధవి, తదితరులు పాల్గొన్నారు.
పచ్చదనం పెంచండి
జిల్లాలో మొక్కలు విస్తారంగా నాటాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఇంటి ముందు, దుకాణాల ముందు మొక్కలు ఉండాలని చెప్పారు. భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించడానికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, మున్సిపల్ కమిషనర్లు వేగంగా పనిచేస్తేనే సాధ్యమన్నారు.
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశం
పోలీసుల త్యాగాలు స్మరణీయం
బాపట్ల టౌన్: పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో అమరజవాన్ స్తూపం వద్ద మంగళవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఏఆర్ సిబ్బంది ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ జరిగింది. పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల త్యాగాలను స్మరించుకునే రోజు ఇదన్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన సమైక్యత దినోత్సవంతో కార్యక్రమాల ముగింపు ఉంటుందని వెల్లడించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు, బహుమతులు అందించారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.