
నిరంతరం సాగునీటి సరఫరా జరగాలి
గుంటూరు జిల్లా కలెక్టర్
గుంటూరు వెస్ట్: జిల్లాలో సాగునీటి కాలువలు పరిధిలోని పంట పొలాలకు నిరంతరం నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సాగు నీటి కాలువలు కింద ఉన్న తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాలువల నిర్వహణ, మరమ్మత్తులు, అభివృద్ధికి మంజూరు చేసిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి వేగవంతంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు చానల్ అభివృద్ధి, విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. జిల్లాలోని భారీ సాగునీటి కాలువలు కే డబ్ల్యూ డెల్టా, గుంటూరు కెనాల్స్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సత్తెనపల్లి, లింగాయపాలెం బ్రాంచ్ కాలువల పరిధిలోని సాగు భూముల విస్తీర్ణం, వరదనీటి డ్రెయిన్లు వివరాలను మ్యాప్‌లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటరత్నం, ఈఈ రమేష్, డ్రైయినేజ్ విభాగం డీఈ ధనలక్ష్మి, ఏఈలు పాల్గొన్నారు.
నీటి పథకాల వివరాలు సమర్పించాలి
జిల్లాలో రక్షిత నీటి పథకాల వివరాలను పూర్తి స్థాయిలో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, డీఆర్‌డీఏ కార్యక్రమాలపై స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నీటి పథకం వసతులు, ఫిల్టర్ రకం, ఎన్ని ఆవాసాలకు సరఫరా చేస్తున్నది, పథకం వివరాలను పూర్తి స్థాయిలో సమర్పించాలన్నారు.