
ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డంకులు
ఆచరణలో కనిపించని ‘ఉచిత ఇసుక విధానం’ రీచ్‌లో రేయింబవళ్లు లారీలకు యంత్రాలతో లోడింగ్
నర్సరావుపేట: మండలంలోని కొత్తపల్లి ఇసుక రీచ్‌కు ట్రాక్టర్లు వెళ్లకుండా దారికి అడ్డంగా గండికొట్టారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అని చెబుతున్నా అది ఆచరణలో ఏ మాత్రం కనిపించడం లేదు. ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుకు తీసుకు వెళ్లవచ్చని దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి నిరాశే ఎదురవుతోంది. సీఎం చంద్రబాబు ప్రకటనలకు, ఇక్కడ జరుగుతున్న ఘటనలకు పొంతన ఉండటం లేదు. నదిలోకి ట్రాక్టర్లు వెళ్లకుండా రీచ్ నిర్వహకులు దారికి అడ్డంగా గండి కొట్టడంతో సోమవారం పలు ప్రాంతాల నుంచి వచ్చిన ట్రాక్టర్లు నిలిచిపోయాయి. కొత్తపల్లి వద్ద ఇసుక రీచ్ నిర్వాహకులు నదిలోకి తమ ట్రాక్టర్లు వెళ్లకుండా ఇలా చేయడం సరికాదని, ఎంతో వ్యయప్రయాసలతో వస్తే అడ్డుకుంటున్నారని ట్రాక్టరు డ్రైవర్లు, యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు మాత్రమే ట్రాక్టర్లు వెళ్లకుండా చేస్తున్నారని, రాత్రిళ్లు పెద్ద జేసీబీలతో నదిలో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. భారీ లారీలలో మోతాదును మించి లోడ్ చేసుకుని ఇసుకను ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారని వారు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదన్నారు. సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, బెల్లంకొండ తదితర మండలాల ట్రాక్టర్ల వారు ఇలా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలోనే ఏ ఆటంకాలు లేకుండా ఇసుక రవాణా చేసుకునేవారమని ట్రాక్టరు యజమానులు చెబుతున్నారు.

ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డంకులు