
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
నరసరావుపేట: పవిత్ర కార్తిక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలెన సామర్లకోట – కుమారరామం, ద్రాక్షారామం – భీమారామం, పాలకొల్లు – క్షీరారామం, భీమవరం – సోమారామం, అమరావతి – అమరామంలను ఒకే రోజున దర్శించడానికి డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు మేనేజర్ బూదాటి శ్రీనివాసరావు వెల్లడించారు. భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 73828 96041, 73828 96146, 9959225428 నంబర్లను సంప్రదించాలని కోరారు.
నరసరావుపేట ఈస్ట్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అవార్డులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడల శాఖ 2025 సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడా కారులకు అర్జున, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నా, ద్రోణాచార్య తదితర అవార్డులు అందించేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీ రాత్రి 12 గంటలలోపు అర్హత గల క్రీడాకారులు దరఖాస్తులను www.dbtyas& sports.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పంపాలని ఆయన సూచించారు.
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ భవన్‌లో ఈనెల 25వ తేదీ శనివారం పల్నాడు జిల్లా పెన్షనర్ల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు జిల్లా శాఖ అధ్యక్షుడు మానం సుబ్బారావు, కార్యదర్శి సి.సి.ఆదెయ్య బుధవారం తెలిపారు. సమావేశంలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణతో పాటు నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని శాఖల అధ్యక్ష్య, కార్యదర్శులు, సభ్యులు, జిల్లా కార్యవర్గం, పెన్షనర్లు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.
సాక్షి, అమరావతి: నరసరావుపేటలోని ఎన్‌బీటీ–ఎన్‌బీసీ కళాశాలకు చెందిన భూమి, ఆస్తులతో పాటు నిర్వహణ బాధ్యతలను శ్రీ త్రికోటేశ్వరస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీకి అప్పగిస్తూ ఉన్నత విద్య కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీకి చెందిన వ్యక్తులు కళాశాల నిర్వహణపై పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం కళాశాల విద్య ద్వారా ప్రత్యేక అధికారిని నియమించి కార్యకలాపాలు సాగించింది. ఈ క్రమంలో కోర్టు కేసులు పరిష్కారం, వ్యక్తుల మధ్య గొడవలు సద్దుమణగడంతో తిరిగి కళాశాల నిర్వహణ బాధ్యతలను సొసైటీకి అప్పగించింది.