
పటిష్టంగా ఓటరు క్లయిమ్‌ల విచారణ
ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు
చీరాల టౌన్: చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు క్‌లైమ్‌ల విచారణ బీఎల్‌వోలతో సమర్థంగా నిర్వహిస్తున్నామని ఈఆర్‌ఓ, ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు తెలిపారు. బుధవారం చీరాల తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఓటరు క్‌లైమ్‌ల విచారణలపై ఆర్డీఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ 106 చీరాల నియోజకవర్గంలో ఓటరు క్‌లైమ్ అర్జీలు పెండింగ్‌లో లేకుండా బీఎల్‌వోలు సమర్థంగా పని చేస్తున్నారని రాజకీయ పార్టీల నాయకులు తమ బూత్ ఏజెంట్లతో విచారణ చేయించుకోవచ్చన్నారు. క్‌లైమ్ అర్జీని నిశితంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో అవాంతరాలు లేకుండా విచారణ చేస్తున్నారని ఏమైనా అభ్యంతరాలుంటే వివరాలను తెలియజేయాలన్నారు. మృతి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రతి బీఎల్‌వో వారికి కేటాయించిన పోలింగ్ బూత్‌లోని ఓటర్ల పూర్తి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. క్లైమ్‌ల విచారణలో ఈసీ నిబంధనల ప్రకారం చేయాలని ఇష్టానుసారంగా విధులు నిర్వహించవద్దనే ఆదేశాల జారీ చేశామన్నారు. సమస్యలను తనకు గానీ, ఏఈఆర్వోలకు గాని తెలియజేయాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులకు ఉన్న పలు సమస్యలను ఆర్డీఓ నివృత్తి చేశారు. పోలింగ్ కేంద్రాల మార్పులు చేసేందుకు పార్టీల నాయకులు అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ, మున్సిపల్ టీపీఓ శ్రీనివాసరావు, డీటీ సుశీల, వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షుడు యాతం మేరిబాబు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు జి.శివరాంప్రసాద్, అలీబాబు, బాబురావు, భరణీరావు పాల్గొన్నారు.