
వైఎస్సార్ సీపీ కార్యదర్శుల నియామకం
చీరాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శులుగా చీరాల నియోజకవర్గానికి చెందిన కావూరి బాలకోటిరెడ్డి, పర్చూరు నియోజకవర్గానికి చెందిన సరిమళ్ళ ఏసుబాబులు నియమితులయ్యారు.
మార్టూరు: జాతీయ రహదారిపై ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఓ లారీ రాజుపాలెం కూడలి వద్ద అదుపుతప్పి కాలువలోకి దూసుకు వెళ్లిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వేగంగా వెళుతున్న లారీ వెనుక ఛాయిస్ విరిగిపోయి టైరు పగిలిపోయింది. అనంతరం డివైడర్‌ను ఢీకొన్న లారీ అదుపుతప్పి రహదారి పక్కనగల కాలువలోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జె.పంగులూరు: ఈఓ మినిశెట్టి శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నూజిళ్లపల్లి ఈఓగా శ్రీనివాసరావు పనిచేసే సమయంలో శ్రీ బాలరాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి 2020 ఏడాదికి దసరా ఉత్సవాల నిర్వహణలో పూజ, గ్రామోత్సవం జరగకపోయినా నిర్వహించినట్లు నివేదించడంతో పాటు పలు ఆలయ భూముల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. దీంతో దేవాదాయ కమిషనర్.. ఈఓ శ్రీనివాసరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు సతైనపల్లి రోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం తెలిపారు. అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, షటిల్, చెస్, యోగా, బాస్కెట్‌బాల్ తదితర 19 క్రీడాంశాలలో పోటీ నిర్వహించి, జిల్లాస్థాయి క్రీడాకారులను ఎంపిక చేస్తామని వివరించారు. ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు జిల్లా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఆసక్తి గల ఉద్యోగులు తమ కార్యాలయ గుర్తింపు కార్డు, ఇతర ధ్రువపత్రాలతో ఈనెల 28న స్టేడియంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయానికి హాజరు కావాలని ఆయన కోరారు. వివరాలకు 87126 22574 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
తాడికొండ: క్వారీ గుంతలో పడి పశువుల కాపరి మృతి చెందిన ఘటన తాడికొండ మండలం కంతేరు గ్రామం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంతేరు గ్రామ శివారు ఆర్‌యూబీ సమీపంలోని బ్రిక్స్ ఇండస్ట్రీ పక్కన ఉన్న క్వారీ గుంతల సమీపంలో పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన తోట ప్రసాదరావు(65) అనే వృద్ధుడు మంగళవారం పశువులను మేపేందుకు ఉదయం 10 గంటల సమయంలో వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడని తెలిసిన వ్యక్తి మృతుడి కుమారుడికి తెలిపాడు. ఒడ్డున ఉన్న దుస్తులు గమనించి తన తండ్రికి చెందినవిగా గుర్తించి క్వారీ గుంతలలో గాలించినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. బుధవారం మృతుడి శవం నీటిలో తేలియాడటంతో గమనించి తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని కుమారుడు తోట సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.