
సముద్ర తీరంలో పెట్రోలింగ్ చేయాలి
కలెక్టర్ వినోద్‌కుమార్
చీరాల: తీరంలో పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా బోట్లతో పెట్రోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలోని బీచ్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బాపట్ల, చీరాల బీచ్‌లలో పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా శని, ఆదివారాలు పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. సిబ్బందికి లైఫ్ జాకెట్లు, విజిల్స్ ఇవ్వాలని సూచించారు. వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పొట్టి సుబ్బయ్యపాలెం నుంచి రామాపురం బీచ్ వరకు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. స్థానిక మత్య్సకారుల సమస్యలను తెలుసుకున్నారు. చైన్నె నుంచి పెద్ద బోట్లవారు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. వారు రాకుండా చూడాలని కలెక్టర్‌ను కోరారు. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని, లోఓల్టేజీ సమస్య ఉందని, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ వెంట వేటపాలెం ఎంపీడీఓ రాజేష్, తహసీల్దార్ గీతారాణి, ఇతర అధికారులు ఉన్నారు.