
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్
బాపట్ల: బాల్య వివాహ రహిత బాపట్ల జిల్లా దిశగా కలిసికట్టుగా పని చేద్దామని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ముద్రించిన బాల్యవివాహాలు – చట్ట రీత్య నేరం, అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లు, చైల్డ్ హెల్ప్ లైన్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
దేవదాయ శాఖ భూములను పరిరక్షించాలి
దేవదాయశాఖ భూముల పరిరక్షణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. దేవదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూములు, ఆస్తుల వివరాలను మండలాల వారీగా జాబితాలను తయారు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. సమావేశంలో జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సూర్య ప్రకాష్, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కనక ప్రసాద్, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి పాల్గొన్నారు.
బాల కార్మికుల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి
బాల కార్మికుల నిర్మూలనకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో న్‌శుక్రవారం బాల కార్మికుల నిర్మూలన జిల్లా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలకు రాని విద్యార్థుల వివరాలను సేకరించాలని ఆయన విద్యాధికారులకు తెలిపారు. 14 సంవత్సరాల్లోపు పిల్లలు ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలోనే ఉండాలని, వారు ఎక్కడా పని చేయడానికి వీల్లేదని చెప్పారు.
అసంఘటిత కార్మికుల సంక్షేమానికి చర్యలు
వివిధ రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికుల పేర్లను ఈశ్రం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు, ఆదాయ పన్ను పరిధిలోకి రానివారంతా అర్హులేనని కలెక్టర్ పేర్కొన్నారు.
లబ్ధిదారులకు సామాజిక భద్రతతో పాటు ఇతర సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ వెంకట శివప్రసాద్, వ్యవసాయ మార్కెటింగ్ మేనేజర్ రమేష్, మత్స్యశాఖ ఉప సంచాలకులు గాలి దేవుడు, వ్యవసాయ శాఖ జేడీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.