
గెలుపే లక్ష్యంగా ముందుకుసాగాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్
బాపట్ల: క్రీడల తరహాలో జీవితంలోనూ గెలుపు లక్ష్యంగా పోటీతత్వంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ఏడవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపిక పోటీలు శనివారం స్థానిక బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మొదలయ్యాయి. రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పోటీలను ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జాతీయ జెండాను కలెక్టర్ ఎగురవేయగా, రెవెన్యూ అసోసియేషన్ జెండాను సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు ఆవిష్కరించారు. తదుపరి వాలీబాల్, కబడ్డీ, కుర్చీలాట, చదరంగం, క్యారమ్స్ పోటీలను తిలకించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి బాపట్లలో మంచి అవకాశాలు కల్పిస్తామని ప్రోత్సహించారు. పాఠశాల విద్యార్థిగా కర్ణాటక రాష్ట్రం సౌత్ జోన్ పరిధిలో క్రికెట్ ఆడానని, పదో తరగతిలో బాస్కెట్ బాల్ జిల్లా బృందంలో సభ్యుడిగా ఉన్నానంటూ తన అనుభవాలను మననం చేసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిలో రెవెన్యూ ఉద్యోగుల బాధ్యత చాలా కీలకమని బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా చెప్పారు. క్రీడాకారులు పతకాలు సాధించాలని చీరాల ఆర్డీవో టి.చంద్రశేఖర్ తెలిపారు. గెలుపోటములు పక్కనపెట్టి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి తెలిపారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్. సురేష్ బాబు, ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ముప్పులనేని శ్రీనివాసరావు, కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కె.పాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.