
ఇసుక మాయం.. కృష్ణమ్మకు శోకం
నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు ప్రేక్షకపాత్రకే పరిమితమైన పోలీసు, రెవెన్యూ యంత్రాంగం జేబులు నింపుకొంటున్న కూటమి నేతలు
ట్రాక్టర్లు దిగకుండా పికెట్
కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారం ఎక్కువైంది. తవ్వకాలను నిలువరించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో బృందాలు ఏర్పాటు చేసినా ఇసుకాసురులు ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా ఇసుక తీసుకెళుతున్నారు. భారీ సంఖ్యలో ట్రాక్టర్లు నదిలోకి ప్రవేశించినా పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.
కొల్లూరు: కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు కృష్ణానదిలో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం మండలంలోని గాజుల్లంక వద్ద ఇతర ప్రాంతాలకు చెందిన ట్రాక్టర్లు వందల సంఖ్యలో నదిలో నీటి మధ్యన ఇసుక తవ్వకాలు చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు నదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం కొనసాగుతోంది. ఈ తరుణంలో రెవెన్యూ, పోలీసు బృందాలను ఈ తవ్వకాలను అరికట్టేందుకు ఏర్పాటు చేశారు. తీర గ్రామాలకు చెందిన వ్యక్తులను సైతం గృహ నిర్మాణ అవసరాలకు ఇసుక తరలింపుపై అధికారులు ఆంక్షలు పెట్టారు. ట్రాక్టర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమైంది. అధికారుల కళ్లెదుటే నదిలోకి ట్రాక్టర్లు వెళ్లినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత ఇసుక సాకుతో భారీ సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా వాల్టా వంటి చట్టాలను అతిక్రమించి తవ్వకాలు చేపడుతున్నారని మండిపడ్డారు. కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇలా వ్యహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
కేసులు కూడా శూన్యం
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లను ఎప్పుడైనా స్వాధీనం చేసుకున్నా, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం లేదు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను శనివారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్రమ రవాణాదారులతో అధికారులు కుమ్మక్కయ్యారని సమాచారం.
కృష్ణా నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి తరలించకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశాం. ఉదయం వేళ అధికారుల బృందాలను లెక్క చేయకుండా నదిలోకి ట్రాక్టర్లు దిగాయి. ఇసుక లోడింగ్ చేస్తున్న సమాచారంతో సిబ్బందితో వెళ్లేసరికి ఇసుక అన్‌లోడ్ చేసి ట్రాక్టర్లతో పరారయ్యారు. ఇకపై తవ్వకాలు చేపడితే కేసులు తప్పవు.
– జానకి అమరవర్ధన్, ఎస్‌ఐ, కొల్లూరు