
సెపక్‌తక్రా విజేత కృష్ణ
●ద్వితీయ, తృతీయ స్థానాల్లో ప్రకాశం, తూర్పు గోదావరి
●క్రీడాకారులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేత
చీరాల రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా జూనియర్ బాల, బాలికల పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. స్థానిక మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన పోటీలకు రాష్ట్రంలోని 17 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన బాల, బాలికల జట్లు అన్ని విభాగాల్లో రాణించి విజేతలుగా నిలిచి ప్రథమ స్థానాలను కై వసం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. తృతీయ స్థానాన్ని తూర్పు గోదావరి జిల్లా జట్టు గెలుచుకుంది. అలానే బాలుర విభాగంలో కృష్ణా జిల్లా జట్టు బాలుర విభాగంలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోగా ద్వితీయ స్థానాన్ని ప్రకాశం జిల్లా జట్టు గెలుపొందింది. తృతీయ స్థానంలో అనంతపురం జిల్లా జట్టు నిలిచింది. ఈ పోటీలు ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఆసక్తికరంగా.. ఉత్కంఠ భరితంగా జరిగాయి. బరువైన బాలును ఒక్క కాలితో గాలితో ఎగిరి కొట్టి అవతలి కోర్టులోని పంపాల్సి ఉంది. అయినప్పటికీ క్రీడాకారులు ఎంతో పట్టుదలతో గెలుపుకోసం ఆటపై పట్టు సాధిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆటను తిలకించేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. విజేతలుగా నిలిచిన క్రీడా జట్లకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెపక్‌తక్రా జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబూరావు, ఏపీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి, నరసరావుపేట ఎంఎం కాలేజెస్ చైర్మన్ ఎంఆర్ రామశేషగిరిరావు, సెపక్‌తక్రా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇస్తర్ల సుభాషిణి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. బాపట్ల జిల్లా సెపక్‌తక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్ర, జిల్లా అథ్లెటిక్ ట్రాక్, ఫీల్డ్ కోచ్ వి.వనజ, గజవల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.