
చదువుతో పాటు ఆటపాటలూ అవసరమే..
రేపల్లె: చిన్నారులు విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు ఆటపాటల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని డాక్టర్ ఆకురాతి సుబ్బారావు తెలిపారు. మండలంలోని పేటేరు జడ్పీ హైస్కూలులో ఏపీ పాఠశాల విద్యాశాఖ, రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–14 బాలబాలికల తైక్వాండో పోటీలు ఆదివారం రెండవ రోజు ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రోత్సాహం ఉంటే విద్యార్థులు ఏదైనా సాధిస్తారని, వారిని విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారని సూచించారు. జిల్లా కామన్ ఎగ్జామినేషన్ సెక్రటరీ కొచ్చెర్ల ప్రభాకరరావు మాట్లాడుతూ పోటీల్లో 260 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఇందులో బాలికల విభాగంలో 11 మంది బంగారు, 11 మంది రజత, 22 మంది కాంస్య పతకాలు సాధించారని పేర్కొన్నారు.బాలుర విభాగంలో 11 మంది బంగారు, 11 మంది రజత, 22 మంది కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. బంగారు పతకాలు సాధించిన బాలురు కొహిమాలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బాలికలు నవంబర్‌లో పంజాబ్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు చెరుకూరి బాబూజీ, దాతలు రావు హరిప్రసాద్, పర్చూరు శ్యామ్‌ప్రసాద్, విద్యాకమిటీ చైర్మన్ జె.రేణుకయ్య, సర్పంచ్ కనపర్తి వసుమతి, ఎంపీటీసీ సభ్యురాలు రావు నెహ్రూ లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు