
కోడి పందేల స్థావరంపై దాడులు
పెదకాకాని: కోడిపందేల స్థావరంపై దాడులు జరిపి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెనిగండ్ల శివారులో ఆదివారం కోడి పందేలు వేసేందుకు సుమారు 50 మంది పందెంరాయుళ్లు కోళ్లతో అక్కడికి చేరుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.9,300, 17 బైక్‌లు, 8 సెల్‌ఫోన్‌లు, కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. గత కొంతకాలంగా వెనిగండ్ల శివారులోని నిర్మానుష్య ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కోళ్లకు కత్తులు కట్టే వారు ఈ పందేల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.