
రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీలు ప్రారంభం
చీరాల రూరల్: చీరాల హైస్కూలు రోడ్డులోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో 29వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా జూనియర్ బాల, బాలికల పోటీలు శనివారం ఉత్సాహంగా ప్రారంభయమ్యాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను ముఖ్య అతిథిగా సెపక్‌తక్రా జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ క్రీడకు బాపట్ల జిల్లాలో తగిన ప్రాధాన్యం లేదని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలతో భవిష్యత్తులో ఆదరణ లభిస్తుందన్నారు. మొదటి రోజు పోటీల్లో ఆయా జిల్లాల క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ స్థానాల కోసం ఎంతో శ్రమించారన్నారు. ఆదివారం కూడా ఇవి కొనసాగనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, వన్ టౌన్ సీఐ సుబ్బారావు, ఇస్తర్ల సుభాషిణి, క్రీడాకారులు పాల్గొన్నారు.