
టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సీపీలో చేరిక
జగనన్న పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్
చెరుకుపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన మళ్లీ రావాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. మంగళవారం గుళ్లపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రేపల్లె నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడుగు ఫణికుమార్‌తో పాటు అదే గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, స్థానిక సర్పంచ్ ఏమినేని సుబ్బారావు, పార్టీ మండల కన్వీనర్ దుండి వెంకట రామిరెడ్డి, మరియు పలువురు వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
డాక్టర్ ఈవూరు గణేష్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఫణి కుమార్ మాట్లాడుతూ పేదలకు పూర్తిస్థాయిలో సంక్షేమం అందాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనే వైఎస్సార్ సీపీలో చేరినట్లు పేర్కొన్నారు. డాక్టర్ గణేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని చిత్తుగా ఓడించి, వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. పార్టీలో కొత్తా పాతా తేడా లేకుండా ఎలాంటి సమస్యవచ్చినా తనతో నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందన్నారు. గ్రామ ఉపసర్పంచ్ ఆరాధ్యుల రోశయ్య, అలివేలు సన్ని, పెనుమాల రవి, అంబటి రాంబాబు, జంగం మాణిఖ్యారావు, దావులూరి రాంబాబు, జంగం విజయ్‌కుమార్, పెనుమాల విద్యాసాగర్, మంచాల శ్రీనివాసరావు, షక్ ఫిరోజ్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.