
ప్రభుత్వ పథకాల అమలులో అశ్రద్ధ వద్దు !
కలెక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో ఉంచేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు ప్రతి మండలంలో ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేశామని, ఆయన వసతి గృహాలను దత్తత తీసుకొని పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. వసతి గృహాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో పూర్వ విద్యార్థులను మమేకం చేసుకొని వారి ద్వారా మెరుగుపరచాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాల్లో లోపల, బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారానికి వచ్చే అర్జీదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. గ్రామస్థాయి అధికారులు ప్రజలను కలిసేటప్పుడు గుర్తింపు కార్డులు ధరించాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీని తనిఖీ చేసి నివేదికను తయారు చేయాలని జిల్లా వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడు వారి నుంచి సానుకూల స్పందన వస్తుందని, ఆ దిశగా పని చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో స్వామిత్వ సర్వేని వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. 205 రెవెన్యూ గ్రామాల్లో స్వామిత్వ సర్వేను నూరు శాతం పూర్తి చేయాలని చెప్పా. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వచ్చే అర్జీల ఆడిటింగ్, ఈ–క్రాప్ నమోదు, సీసీఆర్సీ కార్డుల జారీ తదితర విషయాలపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, ఏఏఓ అనూరాధ, డీపీఓ ప్రభాకర్, ఇన్‌చార్జి పీడీడీఆర్ డీఏ లవన్న, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కనక ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రకాశరావు, వీక్షణ సమావేశం ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.