
ఏరులై పారుతున్న నకిలీ మద్యం
అవన్నీ సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లే వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజం
సంతనూతలపాడు: ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని దేశంలో ఎక్కడా లేని వింత వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 16 నెలలుగా నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 85 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 40 నుంచి 50 లక్షల మందికే అందజేశారని విమర్శించారు. లైసెన్సు ఉన్న డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం అందజేస్తానన్న చంద్రబాబు కేవలం ఆటోలు తోలే డ్రైవర్లకు అది కూడా కోత విధించడం దారుణమన్నారు. పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చి మాట తప్పారన్నారు. నకిలీ మద్యం సరఫరాతో చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో బూం బూం అంటూ విమర్శలు గుప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ బ్రాండ్‌తో పాటు సూపర్ సిక్స్ అనే బ్రాండ్ మద్యాన్ని కూడా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో నకిలీ మద్యం ప్లాంట్లు రెండు బయటపడడం, వీటి వెనుక టీడీపీ కీలక నేతలే ఉండడం, ఉత్తరాంధ్ర లోనూ నకిలీ మద్యం ప్లాంట్లు ఉన్నాయని సమాచారం రావడంతో రాష్ట్రంలో మద్యం ప్రియుల వెన్నులో వణుకు పుడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తోందని ప్రజలకు అర్థమైందన్నారు. నకిలీ మద్యం ఎలా తయారు చేయాలో కూటమి నాయకులకు ఆఫ్రికాలో శిక్షణ ఇచ్చి ఆ ఫార్ములా ద్వారా నకిలీ మద్యాన్ని ప్రభుత్వ పెద్దలే ఏరులై పారిస్తున్నారని విమర్శించారు.
మందు తాగొద్దు.. తస్మాత్ జాగ్రత్త:
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కలుగు నాయుడుగా మిగిలిపోయారని మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అరవటం, రెచ్చిపోవటం, ఊగి పోవటం, తూగిపోవటం, జుట్టు పీక్కోవటం లాంటి చేష్టలు చేసిన ఆయన ఇప్పుడు మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడకుండా కలుగులోనే ఉంటున్నారని విమర్శించారు. సొంత అన్నయ్యను బాలకృష్ణ అగౌరవపరిచినా బయటకు రాకపోవడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం అని వ్యాఖ్యానించిన కూటమి నాయకులు ప్రస్తుతం సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లు తయారు చేసి వైన్ షాపులు, బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి మద్యం బాటిల్‌ను డిస్టిలరీల్లోనే తయారు చేశారని, ఇప్పుడు టీడీపీ నాయకుల ఇళ్లలోనే నకిలీ మద్యం తయారవుతోందని ధ్వజమెత్తారు. మందు బాబులు ఈ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కూటమి సర్కారు పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు.