
గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులు
●దాడులకు భయపడేది లేదు
●అధికారంలోకి రాగానే బదులు
తీర్చుకుంటాం
●మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
పిడుగురాళ్ల: కొంత మంది వ్యక్తులకు డబ్బులు ఇచ్చి గ్రామాల్లో ఫ్యాక్షన్ పెంచాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల టీడీపీ మూకల దాడిలో గాయపడి పట్టణంలోని పల్నాడు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న చల్లా అంజిరెడ్డిని మహేష్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్‌కుమార్‌లు మంగళవారం పరామర్శించారు. మహేష్‌రెడ్డి మాట్లాడుతూ జూలకల్లు గ్రామంలో పటిష్టంగా ఉన్న వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలని, అలజడి సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. ఏడాదిన్నరలో అంజిరెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డిలపై దాడులు చేశారని తెలిపారు. నారు తీసుకొని వచ్చేందుకు వెళ్తే దారి కాచి అంజిరెడ్డిపై దాడి చేశారని తెలిపారు. గ్రామంలో కొంతమంది అలగా జనం చేస్తున్నారని, దీనికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని, ప్రభుత్వం మారగానే ఎవరికి సంబంధం ఉందో తెలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను నాలుగు, ఐదుసార్లు ఆసుపత్రి చుట్టూ తిప్పుదామని అనుకుంటే రేపు ప్రభుత్వం మారితే 40సార్లు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నేడు 20 ఎకరాలు బీడులుగా పెడితే రేపు 200, 300 ఎకరాలు బీడు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, గ్రామాల్లో మళ్లీ ఫ్యాక్షన్ తెవాలని చూస్తే అది మీ కర్మ అని అన్నారు. పోలీసు ఇప్పటికై నా శాంతియుతంగా ఉండేలా చూడాలని, కొట్టిన వారే గ్రామాల్లో గొడ్డళ్లు పట్టుకొని తిరుగుతున్నారని అన్నారు. దాడులకు భయపడేది లేదని జూలకల్లు గ్రామంలో పార్టీని మరింత పటిష్ట పరుస్తామని కాసు అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, పట్టణ కన్వీనర్ మాదాల కిరణ్‌కుమార్, ఎంపీపీ గార్లపాటి వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, ఎన్‌డీఎల్, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కో ఆర్డినేటర్ మట్టారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.