
తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు – 2026 సన్నాహాల్లో భాగంగా శనివారం కలెక్టర్ బంగ్లా రోడ్ భారతీయ విద్యాభవన్‌లో ‘తెలుగు భాషా వికాసం‘పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవంలో భాగంగా 44 చిత్రాల ప్రదర్శన నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాడారని, ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి కావాలని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ జాతి అస్తిత్వానికి మాతృభాష కొలమానమని అన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని మాట్లాడుతూ లలిత కళలు, మన సంస్కృతి గొప్పతనంపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జరిగే మూడో ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. సభలో వీవీఐటీ విశ్వవిద్యాలయం కులపతి వాసిరెడ్డి విద్యాసాగర్, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్, నంబర్ వన్ టీవీ చైర్మన్ సుధాకర్‌నాయుడు, చలనచిత్ర ప్రముఖులు దశరథ్, కోన వెంకట్, డి.వై.చౌదరి, బి.వి.ఎస్. రవి, సిరాశ్రీ, సమన్వయకర్త పి.రామచంద్రరాజు, సినీ, టీవీ, రంగాల రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులుపై కొత్తపల్లి సీతారాం దర్శకత్వంలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన తెలుగు వెలుగు గొడుగు గిడుగు లఘు చిత్రం ఆకట్టుకుంది. తెలుగు భాష ప్రాధాన్యతపై నలభైకి పైగా లఘు చిత్రాలను ప్రదర్శించారు.
నలభైకి పైగా లఘు చిత్రాల ప్రదర్శన