
ముగిసిన చేతిరాత శిక్షణ శిబిరం
గుంటూరు రూరల్: అందమైన చేతిరాత అదృష్టమని, అది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మున్నంగి సంజీవరెడ్డి తెలిపారు. శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చేతిరాత శిక్షణ శిబిరం బుధవారంతో ముగసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంజీవరెడ్డి మాట్లాడుతూ అందమైన చేతిరాత వలన విద్యార్థులు పరీక్షల్లో అదనంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. జాతీయ అవార్డు గ్రహీత వి.రామమోహనరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు, 15 వేల మంది ఉపాధ్యాయులు చేతిరాతలో శిక్షణ పొందారన్నారు. వీర గంగాధరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చైల్డ్ లైన్ వెల్ఫేర్ బోర్డు రిటైర్డ్ అధికారి ప్రసాదలింగం మాట్లాడుతూ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందటం అమూల్యమైనదని ప్రశంసించారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి, విద్యార్థులకు అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని సత్కరించిన అనంతరం చేతిరాతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు.