
సాగర్ కాలువకు గండి
కొల్లూరు: కృష్ణమ్మ ఉగ్రరూపంతో నదీ పరీవాహక లంక గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. వాణిజ్య పంటలు ముంపు బారిన పడుతున్నాయి. బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.44 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్ని వరద నీరు ముంచెత్తింది. మండలంలోని పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాల చుట్టూ ఇటుకరాయి తయారీకి అవసరమైన మట్టి కోసం తవ్విన భారీ గుంతల్లోకి నీరు చేరింది. చింతర్లంక, గాజుల్లంక, పోతార్లంక, దోనేపూడి కరకట్ట దిగువు ప్రాంతాల్లో వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. పంట భూములలోకి వరద నీరు ప్రవేశించింది. అరటి, కంద, కూరగాయలు, పసుపు, మినుము పంటలు ముంపు బారిన పడ్డాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని దిగువుకు విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంచుమించు ఇంచుమించు 6.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలే అవకాశాలున్నట్లు అధికారులు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ప్రజలను ఆప్రమత్తం చేశారు. వరద తీవ్రత పెరిగిన పక్షంలో ప్రజలను తరలించడానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు మండలంలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రైతుల గుండెల్లో రైళ్లు
భట్టిప్రోలు: కృష్ణమ్మ బిరబిరమంటూ పరవళ్లు తొక్కుకుంటూ ప్రవహిస్తుంటే లంక గ్రామాల రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ఆరేళ్లుగా ఏటా వరదలు పంటల్ని ముంచెత్తుతున్నాయి. బిక్కుబిక్కుమంటూ దేవునిపై భారం వేసి సాగుకు సమాయత్తమవుతున్నారు. వరదల సమయంలో ఓలేరు పల్లెపాలెం పక్కనే ఉన్న రేవులో నీరు పారుతోంది. దీంతో పంట భూములు కోతకు గురవుతున్నాయి. ఏటా భూములు రేవులో కలిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు తెలిపారు. మండలంలో లోతట్టు ప్రాంతాలైన చింతమోటు, పెదలంక, పెసర్లంక, ఓలేరు లంక గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కారంచేడు: మండలంలోని దగ్గుబాడు సమీపంలో సాగర్ కాలువ కట్ట కోతకు గురైంది. గండి పడిన సమయంలో 130 క్యూసెక్కులు నీరు ప్రవహిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు కూడా వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. కట్టలు పటిష్టంగా లేకపోవడంతో ఈ ప్రమాదం తలెత్తింది.
50 ఎకరాలు మునక
కాలువలోని నీరు సుమారు 50 ఎకరాల్లోకి చేరింది. ప్రస్తుతం పంటలు ఇంకా సాగు చేయక పోవడంతో ఇటు అధికారులు, అటు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాలువలను శుభ్రం చేయించి, అవసరమైన మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాగర్ ఆయకట్టుతో పాటు, కొమ్మమూరు కాలువ ఆయకట్టే ఆధారం. గత ఏడాది సాగర్ కాలువ కట్టల పైన జంగిల్ క్లియరెన్స్ సమయంలో వాటిని పటిష్ట పరచాలని రైతులు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాదం గురించి ఎన్‌ఎస్‌పీ జేఈ రాజేష్‌ను వివరరణ కోరగా, ప్రస్తుతం నీటి ప్రవాహానికి ఓవర్ ఫ్లో అయిందని, దీంతో బలహీనంగా ఉన్న కట్ట కోతకు గురైందని వివరణ ఇచ్చారు. వెంటనే చిమ్మిరిబండ లాకుల వద్ద నీటి ప్రవాహం నిలుపుదల చేశామని తెలిపారు. ప్రవాహం పూర్తిగా తగ్గిన తరువాత తాత్కాలిక మరమ్మతులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వేసవిలో శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు చేస్తామని వివరించారు.

సాగర్ కాలువకు గండి

సాగర్ కాలువకు గండి