
అతివృష్టితో అపర నష్టం!
అపరాల పంటలు వర్షార్పణం నిండా మునిగిన రైతులు పత్తి, జ్యూట్ పంటలకు పొంచిఉన్న ముప్పు
తాడికొండ: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు కుదేలవుతున్నారు. మబ్బుకు చిల్లుపడిందా అన్న చందంగా ప్రతి రోజు వాన కురుస్తుండటంతో రైతన్నలు పంట పొలాల్లో అడుగు పెట్టేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అరకొరగా సాగుచేసిన అపరాల పంటలు వర్షార్పణం కాగా పత్తి పంట ఎదుగుదల లేక ఎర్రబారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జ్యూట్ పంట పరిస్థితి కూడా ఇదేవిధంగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా పొలంలోకి అడుగు పెట్టి అంతర కృషి చేసే పరిస్థితి కూడా లేని కారణంగా పై పాటుగా మందుల పిచికారీ కలుపు ఏరివేత కూడా చేయలేని పరిస్థితితో పొలాలు పిచ్చి కంపల్లా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుండె ‘చెరువు’ అయింది!
ఈ ఏడాది నెలకొన్న అతివృషి పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు పెట్టుబడుల రూపంలో పెట్టిన సొమ్ము అయినా తిరిగొస్తుందా లేదా అనే బెంగ అన్నదాతల్లో పట్టుకుంది. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ, తుళ్ళూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు గత రెండు నెలలుగా నానుతున్నాయి. పంటనష్టం పరిహారం అంచనాలు రూపొందించి అన్నదాతకు అండగా నిలవాల్సిన వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా యత్నించిన దాఖలాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు యూరియా సరఫరా లేక ప్రభుత్వం చేతులెత్తేయగా.. అధిక ధరలు వెచ్చించి కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టామని, తీరా ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కొండవీటి వాగు ముంపునకు గురైన రైతులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అతివృష్టితో అపర నష్టం!

అతివృష్టితో అపర నష్టం!