
ఆన్‌లైన్ గోల్‌మాల్!
●
వేటపాలెం: స్మార్ట్‌ఫోన్ డబ్బు లాగేస్తోంది. ఎంతో విజ్ఞానాన్ని పంచే ఆన్‌లైన్ యువతను ఆత్మహత్యల వైపు నడిపిస్తోంది. చీరాల నియోజవర్గం పరిధిలో పేద , మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా జీవిస్తుంటారు. ఎక్కువ మంది యువత వ్యసనాల బారిన పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రధానంగా 15 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఆన్‌లైన్ జూదాలకు బానిసలు అవుతున్నారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్‌లు వారి పిల్లలకు అందుబాటులో ఉంచడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటగా మొబైల్‌లో సాధారణ ఆన్‌లైన గేమ్స్‌కు బానిసలవుతున్నారు. ఆ తరువాత క్రమేపీ ఆన్‌లైన్ జూదాలకు అలవాటు పడుతూ తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు. చీరాల ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
బ్లాక్‌మెయిల్ చేస్తూ..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌ల యుగం నడుస్తోంది. చేతిలో ఫోన్, నెట్ అందుబాటులో ఉండటంతో ఆన్‌లైన్‌లో ఆటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. రూ.వందలతో మొదలై రూ.వేలు, రూ.లక్షలు చేతులు మారిపోతున్నాయి. ఫోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుంటే.. వారికి సంబంధించిన బంధువులు, మిత్రులకు సదరు కంపెనీల నిర్వాహకులు అసభ్యంగా ఉండే చిత్రాలను మార్ఫింగ్ చేసి పంపుతున్నారు. పలువురు పరువు కాపాడుకునేందుకు ఆప్పు చేసి రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. మరికొందరు బలవన్మరణాలకు యత్నిస్తున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి.
సులభంగా డబ్బు సంపాదించాలని..
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, రమ్మీ, లోడో, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. మొదట సరదాగా మొదలు పెట్టి చివరకు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. దీనికి తోడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు చాలానే ఉన్నాయి. వీటితో సింగిల్ నెంబర్ గేమ్‌కు బానిసలవుతున్నారు. సైబర్ నేరగాళ్లు వీరి ఖాతాలను హ్యాక్ చేసి భారీగా డబ్బంతా లాగేస్తున్నారు.
బాధితులు ఎందరో..
తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి
పిల్లలు, యువకులపై వారి తల్లిదండ్రులు నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. వారికి అనవసరంగా డబ్బు, సెల్ ఫోన్‌లు ఇవ్వడం మంచిది కాదు. ఆన్‌లైన్‌లో వివిధ రకాల మోసపూరిత గేమ్స్ ఉంటాయి. వాటికి అలవాటు పడి బెట్టింగ్‌లపై దృష్టి సారిస్తున్నారు. సరదాగా జూదం అంటూ ఆ తర్వాత వ్యసనంగా మార్చుకుంటున్నారు. అలాంటి వారిని మాకు అప్పగిస్తే కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకొస్తాం. సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ జాదగాళ్ల ఆట కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నాం.
– జనార్దన్, ఎస్సై, వేటపాలెం
ఇంటర్నెట్‌లో గేమ్‌లకు
బానిసలవుతున్న యువత
చీరాల నియోజకవర్గంలో
జోరుగా బెట్టింగ్‌లు
రూ.లక్షలు పోగొట్టుకుంటున్న యువత
డబ్బు ఎర వేస్తున్న ప్రైవేట్
రుణ యాప్‌లు
నగదు తిరిగి చెల్లించకుంటే
బాధితులకు టార్చర్
అప్పులపాలై ఆస్తులు
విక్రయించాల్సిన దుస్థితి
ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేస్తూ.. ఆన్‌లైన్ జూదానికి ఆలవాటు పడి దాదాపు రూ.5 లక్షలు పోగొట్టుకున్నారు.
వేటపాలేనికి చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తె ఇంజినీరింగ్ చదువుతూ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 50 వేలు పోగొట్టుకుంది.
వేటపాలెం గడియార స్తంభం సెంటర్‌లో బడ్డీ కొట్టు నడుపుకొనే వ్యక్తి సింగిల్ నెంబర్ జూదం వ్యసనంగా మారడంతో అప్పుల పాలయ్యాడు. మోసపోయిన వారిలో పోలీసులకు ఫిర్యాదు చేసేవారు తక్కువగా ఉంటున్నారు. విషయం చెప్పుకొంటే పరువు పోతుందని.. లోలోన బాధ అనుభవించేవారే ఎక్కువగా ఉంటున్నారు.