అద్దంకి: నూతనంగా ఏర్పడిన బాపట్లజిల్లా శాసనాలకు ఖిల్లాగా నిలుస్తోంది. క్రీస్తు పూర్వం నుంచి, వివిధ రాజవంశాల వారు బాపట్ల ప్రాంతాన్ని ఏలినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఆయా కాలాల్లో వేసిన రాతి శాసనాలు బయట పడటం వలన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా శాసనాలను బట్టి ఈ ప్రాంతాన్ని చోళులు, పల్లవులు, గజపతులు, కాకతీయులు, చాళుక్యులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు ఏలినట్లు తెలుస్తోంది. ఆ నిలువెత్తు సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. బౌద్ధ, జైన మతాలకు సైతం ఈ ప్రాంతంలో పరిఢవిల్లినట్లు ధర్మవరం, భట్టిప్రోలు ప్రాంతాల్లోని ఆనవాళ్లు చెబుతున్నాయి.
క్రీస్తు పూర్వం నుంచే..
బాపట్ల ప్రాతంలోని పట్టణాలు, గ్రామాలు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచే ఉన్నట్లుగా చిన్నగంజాం, పెద్దగంజాం, భట్టిప్రోలులోని బౌద్ధ స్థూపం చెబుతోంది. ధర్మవరం, అద్దంకి, ధేనువకొండ, మణికేశ్వరం, పేరాయిపాలెం ప్రాంతాల్లో క్రీస్తుపూర్వం 9 నుంచి 5వ శతాబ్దం నాటి రాతి సమాధులు (రాక్షసగూళ్లు) లభించాయి. అద్దంకి మండలంలోని నాగులపాడు గ్రామంలోని చెరువులో 7వ శతాబ్దంలో అయ్యమాపయ్య వేయించిన దాన శాసనం, బల్లికురవ మండలంలోని కూకట్లపల్లిలో 12వ శతాబ్దం నాటి చోళుల శాసనం, పర్చూరు మండలంలోని ఉప్పుటూరు, నూతలపాడు, చెరుకూరులోని త్రివిక్రమ దేవాలయంలోని దాన శాసనం, బాపట్లలోని భావన్నారాయణ స్వామి ఆలయంలోని చోళుల శాసనాల ద్వారా లభించింది.
అద్దంకిలో తొలి తెలుగు పద్యశాసనం
అద్దంకిలో పండరంగడు క్రీస్తుశకం 848లో తన గురువుకు 8 పుట్ల అట్ల పట్టు నేల దానం చేసిన సమయంలో వేయించిన తొలి తెలుగు పద్య శాసనం ఉంది. కొణిదెనలో 11, 12, 13వ శతాబ్దం నాటి మూడు శాసనాలు, కుమార సంభవం కర్త చోళ మహారాజు నన్నే చోళుడు వేయించిన 11వ శతాబ్దం నాటి శాసనం శివాలయంలో లభించింది. దేశంలోనే తొలిసారిగా చిన్నగంజాం మోటుపల్లి రేవు నుంచి సమగ్ర వర్తక వ్యాపారం కోసం వేయించిన అభయ శాసనం, ఓడల ద్వారా సుగంధద్రవ్యాలు, గుర్రాలు, వజ్రాల ఎగుమతి, దిగుమతులు చేసే వ్యాపారంపై 13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని శాసనంలో రకరకాలైన వస్తువులపై రాయితీ కల్పిస్తూ వేసిన శాసనం, 14వ శాతాబ్దంలో వేయించిన అనపోతారెడ్డి వేయించిన శాసనం ఇలాంటివే. ఇవి తెలుగు, తమిళభాషల్లో ఉన్నాయి. ఈ రేవు నుంచి సన్నని నూలు వస్త్రాలు, రవెల్లాలు(నేత) దిగుమతి చేసుకునే వారు. అద్దంకి, రావూరులో గజపతుల 16వ శతాబ్దం నాటివి, మోటుపల్లి, పమిడిపాడులో విజయనగర రాజులు, తక్కెళ్లపాడు, పోతవరంలో పంట మల్లారెడ్డి, కుందుర్రులో కృష్ణదేవరాయలు, చుండూరులో అచ్యుత రాయలు, బొల్లాపల్లి, మణికేశ్వరంలో సదాశివరాయుడు, ధర్మవరంలో గొల్కొండ నవాబు వేయించిన శాసనాల ద్వారా ఆయా కాలాల్లో రాజ వంశాలు ఈ ప్రాంతాన్ని ఏలినట్లు ధ్రువపడుతోంది.
ఎన్నో రాజవంశాలు పాలించిన
పురాతన ప్రాంతంగా ప్రసిద్ధి
నిదర్శనంగా నిలుస్తున్న పలు ఆనవాళ్లు
బౌద్ధ, జైన మతాలకు ఆలవాలం
మ్యూజియం ఏర్పాటు చేయాలి
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బయటపడిన శాసనాల ప్రతులను, వివిధ రకాల వస్తువులను భావితరాలకు తెలిసేలా ఏర్పాట్లు అవసరం. సందర్శకుల కోసమైనా పురావస్తు శాఖ మ్యూజియం ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పుడు మన పూర్వ చరిత్ర పదిలంగా ఉంటుంది.
– జ్యోతి చంద్రమౌళి,
శాసనాల పరిశోధకుడు
శాసనాల ఖిల్లా.. మన జిల్లా