
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
అవనిగడ్డ: పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఆలయంలో పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఆరో వార్డుకు చెందిన చింతలపూడి నాగవర్ధన్, బాపట్ల జిల్లా రేపల్లె ఏడో వార్డుకు చెందిన తోట సాయి మౌనిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి మౌనిక తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో గురువారం మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఈ ప్రేమజంట స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్‌ని ఆశ్రయించడంతో ఇరువురు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కోసం సమాచారం ఇచ్చారు. మౌనిక తల్లిదండ్రులు రాకపోవడంతో నాగవర్ధన్ తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు.
విద్యుత్ షాక్‌తో
ఎలక్ట్రీషియన్ మృతి
వేమూరు: జంపని గ్రామానికి చెందిన వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన గుంటూరు ధనబాబు(25) కరెంట్ పని చేస్తాడు. బుధవారం సాయంత్రం చిలకా సుబ్బారావు ఇంటిలో పని చేస్తుండగా షాక్ కొట్టింది. దీంతో తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యసేవలు అందిస్తుండగా ధనబాబుమృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
ఏడు మండలాల్లో
తేలికపాటి వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 6 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో మిల్లీమీటరు వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు పశ్చిమలో 3.2 మి.మీ., తాడికొండ 3.2, దుగ్గిరాల 2.8, గుంటూరు తూర్పు 2.4, తుళ్లూరు మండలంలో 2.2 మి.మీ చొప్పున వర్షం పడింది.
నేడు భ్రమరాంబకు పసుపు కొమ్ములతో అలంకరణ
పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారు పసుప కొమ్ములు ప్రత్యేక అలంకారంలో శుక్రవారం భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రావణమాసంలో రానున్న శుక్రవారాల్లో భ్రమరాంబ అమ్మవారిని చీరలు, గాజుల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు.