
సైబర్ నేరాల కట్టడికి బ్యాంకర్లు సహకరించాలి
చీరాల అర్బన్: అభివృద్ధి చెందుతున్న సాంకేతికను సైబర్ నేరగాళ్లు నిరంతరం ఉపయోగించుకుంటూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని డీఎస్పీ ఎండీ మొయిన్ ఆందోళన వ్య్తం చేశారు. నేరాల నియంత్రణకు బ్యాంకు మేనేజర్లు వారి బ్యాంకుల్లో భద్రతా నియమాలను సక్రమంగా పాటిస్తే చోరీలను కొంత వరకు అరికట్టవచ్చన్నారు. బుధవారం స్థానిక బాపనమ్మ కల్యాణ మండపంలో డీఎస్పీ అధ్యక్షతన సైబర్ నేరాల, దొంగతనాల నియంత్రణపై బ్యాంకు మేనేజర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నకిలీ ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు, మెయిల్స్ ద్వారా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం పొందుతున్నారన్నారు. వ్యక్తిగత వివరాలు వారి చేతిలోకి వెళ్లగానే ఖాతాల్లోని నగదు ఖాళీ చేస్తున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెబితే వాటిని విశ్వసించ వద్దన్నారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి వారితో మాట్లాడాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలను, ఏటీఎం పిన్ నంబర్లు, సీవీవీ నెంబర్లు ఇతరులకు చెప్పవద్దని సూచించారు. వీటిని అరికట్టేందుకు బ్యాంకులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా, వీడియో రికార్డింగ్ వ్యవస్థలు పనిచేస్తున్నాయా, అలారం, ఎమర్జెన్సీ బటన్‌లు స్థిరంగా పనిచేస్తున్నాయనే అంశాలపై ప్రశ్నించారు. బ్యాంకుల్లో 24 గంటలు పనిచేసే సీసీ కెమెరాలు తప్పకుండా ఉండాలన్నారు. సమావేశంలో బ్యాంకు మేనేజర్లు, సీఐలు నాగభూషణం, శేషగిరిరావు, ఎస్సైలు రాజ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు, జనార్దన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.