
సక్రమంగా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు
బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఏపీఎస్‌డబ్ల్యూసీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ సునీత పేర్కొన్నారు. బాపట్ల, చీరాల, పర్చూరు మండలాలలో బుధవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. బాపట్ల పట్టణంలోని మార్కెట్ యార్డులో గోదామును ఆమె పరిశీలించారు. చీరాల మార్కెట్ యార్డు గోదాము, కొనుగోలు కేంద్రం, పర్చూరు మండలంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రం, మార్కెట్ యార్డు గోదాము, ఎస్‌డబ్ల్యూసీ గోదాములను కూడా పరిశీలించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు, గోదాములలో నిల్వ చేసిన పొగాకు వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న బ్లాక్ బర్లీ పొగాకును భద్రంగా నిల్వ చేయాలని ఎండీ సునీత తెలిపారు. రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసే సమయంలో అధికారులు తేమ శాతాన్ని కచ్చితంగా పరిశీలించాలన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పొగాకును ఎప్పటికప్పుడు గోదాములలో భద్రపరచాలని తెలిపారు. గోదాముల నిల్వ సామర్థ్యం ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. నిల్వ పెరిగితే పొరుగు జిల్లాలకు తరలించాలని పేర్కొన్నారు. ముందస్తుగానే గోదాములను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ కరుణశ్రీ , జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమేష్ బాబు, తదితరులు ఉన్నారు.