
అరుదైన కళతో భారత్‌కు శుభాకాంక్షలు
3 గ్రాముల చెస్‌బోర్డు తయారు చేసిన చీరాల స్వర్ణకారుడు
చీరాల అర్బన్: ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌కు సోమవారం ఓ స్వర్ణ కళాకారుడు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనకున్న అరుదైన కళతో వెండి, బంగారాన్ని ఉపయోగించి మూడు గ్రాముల బరువు, 3.3 సెంటీమీటర్లతో అతి సూక్ష్మమైన చెస్ బోర్డు తయారు చేశా రు. ఇక బియ్యం గింజ సైజులో రాజు, రాణిలు, అదే విధంగా ఆవగింజ సైజులో భటులు, గుర్రాలు, ఏనుగులను తయారు చేసి దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.ఈ చదరంగం కిట్ అంతా కేవలం రెండు రూపాయల కాయిన్ సైజులో ఉండడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ ఇద్దరు భారతీయ మహిళలు తలపడడంతో ఇక చాంపియన్ షిప్ ఇప్పటికే ఇండియా ఖాతాలో పడిపోయిందని, తాను తయారు చేసిన సూక్ష్మ చెస్ బోర్డును ఫైనల్‌లో తలపడిన ఇరువురు క్రీడాకారులకు అంకితం చేస్తానని వెంకటేష్ చెప్పారు. గతంలో కూడా జాతీయ పతాకాలు, అమరవీరుల స్థూపాలు, ఆలయాలు, వరల్డ్‌కప్ ఇలా అనేక సూక్ష్మ కళారూపాలను తయారు చేశానని తెలిపారు.

అరుదైన కళతో భారత్‌కు శుభాకాంక్షలు