
మంత్రి గారూ... సమస్యలు పరిష్కరించండి !
జె.పంగులూరు: మండలంలోని చందలూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికీ వెళ్లి సుపరిపాలన కరపత్రాలను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు సమస్యలు ఏకరువు పెట్టారు. బీసీ కాలనీలో కొంత మంది మహిళలు తాగునీరు సక్రమంగా రావడం లేదని మంత్రి రవికుమార్‌కు తెలిపారు. ఇదే కాలనీలో యనమల అంజమ్మ గ్యాస్ డబ్బులు తనకు రావడం లేదని, రూ.20 మాత్రమే ఖాతాలో జమవుతున్నాయని తెలిపింది. కొనుగోలు కేంద్రానికి పొగాకు చెక్కులు తీసుకొని పొతే నాణ్యత పేరుతో వెనక్కి కొడుతున్నారని రైతు కర్రి బ్రహ్మయ్య మంత్రి ముందు వాపోయాడు. అనంతరం చందలూరులో నూతనంగా నిర్మించిన ఎన్టీర్ కళావేదిక వద్ద జరిగిన సభలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ చందలూరు గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఇప్పటికే రూ.30 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మించినట్లు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని వెల్లడించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం 10 మంది వికలాంగులకు మూడు చక్రాల స్కూటీలు అందించారు. నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు. చందలూరు సీఏసీఎస్ అధ్యక్షులుగా బెల్లంకొండ శ్రీధర్‌బాబు, సభ్యులుగా వట్టెం శేషయ్య, మాగులూరు సుబ్బారావు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్రి వెంకట సుబ్బారావు, పెంట్యాల రాధాకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు వాసవి, మురకొండ సుబ్బారావు, కుక్కపల్లి ఏడుకొండలు, చింత సహాదేవుడు, పార్టీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్ బాబు, గరిమిడి జగన్మోహనరావు పాల్గొన్నారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు
గ్రామస్తుల విన్నపం