
టీడీపీ నుంచి మొగల్ జాన్‌ను సస్పెండ్ చేయాలి
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో రైతులు నష్టపోయిన బంగారాన్ని ఇప్పించాలంటూ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న కౌలు రైతు సంఘం నాయకుడు హనుమంతరావుపై దాడి చేయటాన్ని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కృష్ణయ్య ఖండించారు. అధికార పార్టీకి చెందిన క్రోసూరు మండల అధ్యక్షుడు మొగల్ జాన్ దాడి చేయటం చూస్తుంటే అధికార తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుందా లేక దొంగల పక్షాన పనిచేస్తుందా అని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులపై దాడులు చేస్తే వెన్నుచూపరని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరంతర పోరాటం సాగిస్తారన్నారు. ఆదివారం దొడ్లేరు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ దొడ్లేరు గ్రామస్తులు అనంతవరం మీదగా క్రోసూరు వెళ్లడానికి, ఆవులువారిపాలెం మీదుగా బెల్లకొండ వెళ్లడానికి పలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే పునరుద్ధరించాలని ఆర్ అండ్ బీ అధికారులను కలిసి గ్రామ ప్రజల సమస్యలను విన్నవించామన్నారు. సాగర్ కాలవ నీళ్లు చివరి ఆయకట్టు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు షరతులు లేకుండా రుణాలు కల్పించాలని, అన్నదాత సుఖీభవ నిధులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వై. రాధాకృష్ణ, వై.గోపాలరావు గద్దె చలమయ్య, ఆంజనేయులు నాయక్, జి మల్లేశ్వరి, డి విమల. పి మహేష్, అచ్చంపేట క్రోసూరు మండలాల రైతు సంఘం నాయకులు, హనుమంతరావు ఆవుల ఆంజనేయులు, ఆర్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య డిమాండ్ దొడ్లేరులో ప్రదర్శన, రాస్తారోకో