
బుల్లెట్ అదుపు తప్పి ముగ్గురికి గాయాలు
యడ్లపాడు: జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద బైపాస్ రహదారిపై ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తెలిపిన వివరాలు.. మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన దొప్పలపూడి హనుమానాశాస్త్రి, దండా గోపి, మరొక వ్యక్తి కలిసి బుల్లెట్‌పై చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు ఆదివారం వెళ్తున్నారు. తిమ్మాపురం వంతెనపైనా మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బుల్లెట్‌పై ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం కూడా ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108లో గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వాహనంపై కూర్చున్న వారిలో మధ్యలో ఉన్న వ్యక్తి బుల్లెట్ హ్యాండిల్ పట్టుకున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
క్రీడాకారిణి జెస్సీ రాజ్‌కు మంత్రి అభినందనలు
తాడేపల్లి రూరల్: మంగళగిరికి చెందిన యువ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్‌కు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని ఆయన కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ రోలర్ స్కేటింగ్ సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో జెస్సీ రాజ్ సిల్వర్ మెడల్ సాధించినందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించి, దేశానికి గర్వకారణంగా నిలిచిన ఆమె భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించినట్లు ప్రకటనలో వారు పేర్కొన్నారు.