
పత్తి పంటకు బీమా గడువు పొడిగింపు
నరసరావుపేట రూరల్: వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో పత్తి పంటకు బీమా గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు శనివారం తెలిపారు. భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ అగ్రికల్చర్ ఇన్యూరెన్స్ కంపెనీ ద్వారా జిల్లాలో పంటల బీమా అమలులో ఉందని తెలిపారు. రైతులు పత్తి పంటపై అమలవుతున్న బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల ద్వారా నమోదు చేయబడతారని తెలిపారు. రుణాలు తీసుకోని రైతులు మీ సేవా కేంద్రాలు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు , క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయంలో వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏలను సంప్రదించి నమోదు చేసుకోవాలని తెలిపారు. వాతావరణ సంబంధిత ప్రమాదాల సమయంలో పంటలకు కలిగే నష్టాన్ని బీమా ద్వారా పొందే అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.
ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో
38 అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: జిల్లాలోని ఎస్‌సీ, ఎస్‌టీల కోసం శనివారం కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 38 అర్జీలు స్వీకరించారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేశారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్‌ఓ ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.2.75 కోట్ల విలువైన
20 పనులకు పౌడా ఆమోదం
నరసరావుపేట: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రూ.2.75 కోట్లతో చేసే 20 పనులకు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్‌మెంట్ కమిటీ (పౌడా) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శనివారం కలెక్టరేట్‌లో పౌడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షతన అభివృద్ధి, ప్రణాళికా కార్యకలాపాలపై అథారిటీ నాల్గవ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు అజెండాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలియచేశారు. దీనిలో అథారిటీ సభ్యులు డీటీసీపీ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సునీత, రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ టి.రవీంద్రబాబు, ఏపీ సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.రాంబాబు, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, కాలుష్య నియంత్రణ మండలి విభాగ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పారిశ్రామిక కేంద్ర కార్యదర్శి ఎం.నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
581 అడుగులకు చేరిన
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 581.30 అడుగులకు చే రింది. ఇది 286.7635 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 511, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,20,339 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

పత్తి పంటకు బీమా గడువు పొడిగింపు