
కారు కాలువలో పడి విద్యార్థి మృతి
అమర్తలూరు (వేమూరు) : కారు అదుపు తప్పి కాలువలో పడిన ఘటనలో జూపూడి పవన్ (18) అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఎస్‌ఐ రవితేజ కథనం మేరకు.. విజయవాడలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్న ఏడుగురు విద్యార్థులు శనివారం అద్దెకు తీసుకున్న కారులో ఒంగోలులోని జూపూడి పవన్ ఇంటికి వెళ్లారు. తిరిగి బాపట్ల బీచ్‌కు వెళ్లి, విజయవాడ బయలు దేరారు. ఈ క్రమంలో అమర్తలూరు మండలం ప్యాపర్రు, యలవర్రు రోడ్డు వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కాలువలో పడి పోయింది. కారులో ఉన్న విద్యార్థులు అద్దాలు పగలు కొట్టుకొని బయటకు వచ్చారు. అప్పటికి పవన్ మృతి చెందాడు. మిగిలిన ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా విజయవాడ నగరానికి చెందిన విద్యార్థులని ఎస్‌ఐ తెలిపారు. పవన్ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
అలరించిన గరికపాటి ప్రవచనాలు
నరసరావుపేట: స్థానిక పాతూరులోని శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక తరంగణి, శ్రీ నాగసరపు సుబ్బరాయ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వేదాంత భేరీ ప్రవచనానికి మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు హాజరై ప్రవచనాలు వినిపించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ట్రస్టు చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తాలు డాక్టర్ గరికపాటిని ఘనంగా సన్మానించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కారు కాలువలో పడి విద్యార్థి మృతి