
అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
మేదరమెట్ల: వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్ జిల్లాలకు చెందిన ఇద్దరి దొంగలను కొరిశపాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ మొయిన్ మేదరమెట్లలోని అద్దంకి రూరల్ సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈనెలలో కొరిశపాడు గ్రామంలోని హోటల్ నిర్వాహకురాలి మెడలో బంగారు చైన్ లాక్కొని పారిపోయిన ఇద్దరు దొంగలను పట్టుకోవడం కోసం ఓ టీంను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కొరిశపాడుకు చెందిన మేకల హరీష్, గుంటూరు సంజీవ్‌నగర్‌కు చెందిన షేక్ యాసిన్‌లను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు గత నెలలో వేమూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పోయారు. వీరి వద్ద నుంచి కొరిశపాడులో పోయిన 28 గ్రాముల బంగారు గొలుసు, వేమూరులో పోయిన 30 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ మోటారు బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి బెట్టింగులకు, చెడు వ్యసనాలకు బానిసలైన వీరు ఖర్చుల కోసం వివిధ ప్రదేశాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చైన్‌స్నాచింగ్‌లకు రెక్కీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ మల్లికార్జునరావు, కొరిశపాడు, మేదరమెట్ల, జె.పంగులూరు ఎస్‌ఐలు సురేష్, మహ్మద్ రఫీ, వినోద్‌బాబుతో పాటు వెంకటేష్, నాగరాజు, మత్తయ్య కానిస్టేబుల్స్‌ను రివార్డులతో డీఎస్పీ అభినందించారు.