కౌలు అర్జీలు పరిష్కరించేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

కౌలు అర్జీలు పరిష్కరించేందుకు కృషి

Jul 26 2025 8:46 AM | Updated on Jul 26 2025 9:32 AM

కౌలు

కౌలు అర్జీలు పరిష్కరించేందుకు కృషి

జీఆర్‌ఎం నోడల్‌ అధికారి పి.జయశ్రీ

తాడికొండ: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యలు, వార్షిక కౌలు అర్జీలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని గ్రీవెన్స్‌ రీడ్రెస్సల్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి పి.జయశ్రీ అన్నారు. తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్‌ డే నిర్వహించారు. ఇటీవల రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయిన 11వ ఏడాది వార్షిక కౌలుకు సంబంధించిన సమస్యల గురించి పలువురు తమ అర్జీలను పి.జయశ్రీకి అందజేశారు. సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. జమ కాని వారికి రానున్న 15 రోజులలో జమయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీలను రైతులు ఇచ్చి, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 54 ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్లు బి. సాయి శ్రీనివాస నాయక్‌, ఎం.శేషిరెడ్డి, పి. పద్మావతి, జి. రవీందర్‌, జి. భీమారావు, ఏజీ చిన్నికృష్ణ, సీఆర్‌డీఏ సర్వే విభాగ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి.పాండురంగారావు రామకృష్ణన్‌, సామాజిక సంక్షేమ విభాగ అధికారి శ్రీనివాసరావు, డెవలప్మెంట్‌ ప్రమోషన్‌ జోనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సి.హెచ్‌. మధుసూదనరావు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

గుంటూరు లీగల్‌: మహిళపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.57 వేల జరిమానా విధిస్తూ ఐదవ అదనపు జిల్లా సెషన్‌ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. తాడేపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని సీతానగరం కరకట్ట వద్ద జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2021 జూన్‌ 19న కేసు నమోదు చేశారు. ముగ్గుర్ని నిందితులుగా పరిగణించారు. వారిలో రామలింగం ప్రసన్నరెడ్డి అలియాస్‌ వెంకట్‌ పరారీలో ఉన్నాడు. మరో నిందితుడు షేక్‌ హబీబ్‌ అలియాస్‌ హనిగుండు మృతి చెందాడు. ఇంకో నిందితుడు సిరు కృష్ణకిషోర్‌ అలియాస్‌ కృష్ణను దోషిగా కోర్టు పేర్కొంది. విచారణ అనంతరం అతడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.57 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లపు కృష్ణ బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. అప్పటి సీఐ శేషగిరిరావు కేసు దర్యాప్తు చేయగా, డీఎస్పీ జె.రాంబాబు చార్జిషీట్‌ ఫైల్‌ చేశారు. కోర్టు లైజన్‌ కానిస్టేబుల్‌ బి.శ్రీనునాయక్‌, అప్పటి తాడేపల్లి కోర్టు హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. మహిళకు న్యాయం జరిగేలా చూసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.

బస్సులో బంగారు గొలుసు

అద్దంకి రూరల్‌: బస్సులో దొరికి బంగారుపు చైనును ప్రయాణికులకు అందజేసిన కండక్టర్‌, డ్రైవర్‌ను డీఎం రామ్మోహన రావు శుక్రవారం అభినందించారు. సాయంత్రం దర్శి నుంచి అద్దంకి వచ్చిన బస్సులో కండక్టర్‌ ఏ. సుజాత, డ్రైవర్‌ యం. గిరిరాజులకు 12 గ్రాముల బంగారపు చైను దొరికింది. కాగా డ్రైవర్‌, కండక్టర్‌లు డిపో మేనేజర్‌ రామ్మోహనరావు సమక్షంలో అన్ని వివరాలు కనుగొని ప్రయాణికులు చంద్రకళ, చెన్నమ్మలకు అందజేశారు. చైనుకు లాకెట్‌ ఉండాలని చెప్పటంతో మళ్లీ బస్సులో వెతకగా లాకెట్‌ కూడా దొరకడంతో అదికూడా అప్పగించారు.

కౌలు అర్జీలు పరిష్కరించేందుకు కృషి 1
1/1

కౌలు అర్జీలు పరిష్కరించేందుకు కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement