
బంగారు ఆభరణాలు చోరీ
లక్ష్మీపురం: ఇంట్లో శుభకార్యం జరుగుతున్న నేపథ్యంలో దాచి పెట్టిన 92 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అయిన ఘటన పై అరండల్‌పేట పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. గుంటూరు నగరంలోని కొరిటెపాడు హనుమయ్యనగర్ ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణేశ్వర అనే వ్యక్తి భవన నిర్మాణ పని చేస్తుంటారు. జూన్ నెలలో కుమారుడు వివాహం ఉన్నందున కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. జూన్ 21న ఇంట్లో బీరువాలో 92 గ్రాముల బంగారు ఆభరణాలు భద్రపరిచి, వివాహ పనుల్లో ఉండి పోయారు. అయితే శుభకార్యం అయిన తరువాత ఈ నెల 23వ తేదీన చూసే సరికి ఆభరణాలు కనిపించలేదు. దీంతో శుక్రవారం అరండల్‌పేట పోలీసులకు సమాచారం తెలియజేయగా ఎస్సై సుబ్బారావు, సిబ్బంది వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీమ్ ఆధారాలను సేకరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.