
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ
ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి
పర్చూరు(చినగంజాం): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని లిక్కర్ స్కాం పేరుతో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం ఇక్కడ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి చెందిన సీనియర్ నేతలను పార్టీ అభివృద్ధి కోసం పాటుపడే నాయకులను, కార్యకర్తలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూడటం కూటమి సర్కార్‌కు సమంజసం కాదన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిస్టలరీల ద్వారానే 2019 నుంచి 2024 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసి అమ్మారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ బ్రాండ్‌లతోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లిక్కర్ షాపులను కొనసాగించిందే తప్ప కొత్తగా ఏర్పాటు చేసింది లేదని, ప్రభుత్వ దూకాణాలను ఏర్పాటు చేసి లిక్కర్ షాపుల నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం చేకూరిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని లిక్కర్ అమ్మకాలు చేశారని ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వంలో అదే బ్రాండ్‌లు ఆరు నెలలపాటు కొనసాగించారని, ప్రభుత్వానికి చేకూరే ఆదాయం లేకపోగా బెల్టు షాపులను విపరీతంగా ప్రోత్సహించి పార్టీ నాయకులకు లాభాలు తెచ్చి పెడుతున్నారని ఆరోపించారు.
రైతుల పరిస్థితి పట్టదా?
పార్టీల ప్రాతిపదికన పొగాకు కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసమంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొగాకు సాగు చేసిన వారిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులని.. వారిలో ఎక్కువ మంది కౌలు రైతులున్నారని వారంతా పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారి పంటను కొనుగోలు చేయక పోవడం దారుణమైన విషయమన్నారు.