గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన దినేష్ (20) మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కళాశాల నుంచి తన స్నేహితుడు గణేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయలుదేరాడు. చౌడవరం వద్ద హైవేపై డివైండర్ రైలింగ్‌కు ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఢీకొంది. దినేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌కు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. మృతుని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఒకరోజు శాస్త్రవేత్తలుగా పాఠశాల విద్యార్థులు
ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 8, 9వ తరగతుల విద్యార్థులు ఐదుగురు జాతీయ స్థాయి వన్డే యాజ్ ఏ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌కు ఎంపిక అయినట్లు పాఠశాల హెచ్‌ఎం లింగిశెట్టి సాంబయ్య మంగళవారం తెలిపారు. పాఠశాలకు చెందిన బి.అనుశ్రీ,, షేక్ ఖాసీం, షేక్ మస్తాన్‌వలి, కె.ప్రశాంత్, షేక్ అన్వర్‌లను ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఎంపిక చేశారని చెప్పారు. జిగ్యాసా ప్రోగ్రామ్‌లో భాగంగా దేశంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), అంతర్జాతీయ స్థాయి పరిశోధన సంస్థ (భవనేశ్వర్)లో ఈ నెల 24న విద్యార్థులు అక్కడున్న శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తారని తెలిపారు. విద్యార్థులను పలువురు ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బి.నాగరాజులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.రామాంజనేయులు, రాజులు పాల్గొన్నారు.
పేకాటపై పోలీసులు మెరుపుదాడి
చిలకలూరిపేటటౌన్: మండలంలోని కుక్కపల్లివారిపాలెం గ్రామ శివారులోని పొలాల్లో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ జి. అనిల్ కుమార్ నేతృత్వంలో పోలీసులు మంగళవారం దాడులు చేపట్టారు. అదుపులోకి తీసుకున్నవారి వద్ద నుంచి రూ.3,500 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.