
అస్మదీయుడికి నామినేటెడ్ పదవి
వేమూరు: కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాదారులకు నామినేటెడ్ పదవులు లభించడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్‌కు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా పదవి కట్టబెడ్డటంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. చావలి గ్రామానికి చెందిన ఆయన మెయిన్ సెంటరులో ప్రభుత్వం భూమి కబ్జా చేసినట్లు గ్రామస్తులు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అందులో ఏర్పాటు చేసిన చికెన్ స్టాల్ తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసినా రాజేష్ పట్టించుకోలేదు. చికెన్ స్టాల్ తొలగించకుండా ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులపై కోర్టుకు వెళ్లాడు. ఇది కాకుండా గ్రామంలోని చెరువు స్థలం కూడా ఆక్రమించుకుని, రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీన్ని కొల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు సర్వే నంబర్ వేసి భార్యపై రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. పైగా భవనంపై ప్రైవేటు ఫైనాన్స్ నుంచి రుణాన్ని కూడా తీసుకున్నట్లు గ్రామంలో గుసగుసలు విన్పిస్తున్నాయి. భూ కబ్జాలతో పాటు రాజేష్ ఏప్రిల్ 24న దళిత యువకుడిపై చెప్పుతో దాడి చేశాడు. దీనిపై ఎస్సీ ఎట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఇటువంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం నామినేటివ్ పదవి ఇవ్వడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. పైకి జనసేన నేతలు సిద్ధాంతాలు చెబుతూ, లోపల భూకబ్జాదారులకు పదవులు ఇస్తోందని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని, పార్టీ కోసం పని చేసిన వ్యక్తులను గుర్తించి పదవులు ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.