
ఫిరాయింపుదారులకే పగ్గాలు
చీరాల: ‘పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని.. పక్క పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వారి కంటే పార్టీనే నమ్ముకున్న వారికి న్యాయం చేస్తాం’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. అయితే ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. చెప్పేదొకటి.. చేసేదొకటి.. అనే తీరున చీరాల నియోజకవర్గంలో టీడీపీ వ్యవహార శైలి ఉంది. పార్టీ అధినేత చెప్పిన మాటలనే పెడచెవిన పెట్టి పక్క పార్టీలో నుంచి టీడీపీలో చేరిన వారికే ప్రాధాన్యం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ కౌన్సిలర్‌కు దక్కని గౌరవం
పార్టీనే నమ్ముకుని కష్టాలు పడి పార్టీ కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. పార్టీ జెండాను భుజాన వేసుకుని పనిచేసిన వారిలో కొంత మంది మౌనం పాటిస్తున్నారు. అయితే పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం సరైన గౌరవం లభించడం లేదు. చీరాల మున్సిపాలిటీలో టీడీపీ సింబల్‌పై గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్‌పై పోటీ చేసేందుకు ఎంతో మంది పోటీపడ్డారు. అయితే టీడీపీ తరఫున ఆయన 3వ వార్డులో పోటీ చేసి గెలుపొందారు. అనూహ్యంగా కొన్ని వార్డుల్లో పోటీ చేసిన టీడీపీ అన్నింటా ఓడినా మూడో వార్డు మాత్రం గెలుచుకున్నారు. టీడీపీ అధినేత చెప్పిన విధంగా పార్టీ తరుఫున గెలిచిన కౌన్సిలర్‌కు సరైన గౌరవం ఇవ్వాల్సి ఉండగా ఇటీవల టీడీపీలో చేరిన వారికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కూటమి అధిష్టానం కూడా పార్టీ తరఫున గెలిచిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేకు సూచించినట్లు సమాచారం. అందుకు విరుద్ధంగా పార్టీ ఫిరాయించి కూటమికి మద్దతు పలికిన వారే హవా చూపిస్తున్నారు.
పార్టీ ఫిరాయింపుదారులదే పైచేయి
చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎక్కువ సంఖ్యలో గెలిచి మెజార్టీ ఎక్కువగా ఉండడంతో వైఎస్సార్‌సీపీనే చైర్మన్ పీఠం కై వసం చేసుకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమి పాలవడంతో అప్పటి వరకు పార్టీలో ఉన్న కౌన్సిలర్లు కూటమికి మద్దతు పలికారు. ప్రస్తుతం కూటమిలో వెళ్లిన కౌన్సిలర్లదే హవా నడుస్తోంది. అప్పటి వరకు వెన్నంటే నడిచిన వారంతా కూటమి చెంతకు చేరి చైర్మన్ జంజనం శ్రీనివాసరావును ఎలాగైనా చైర్మన్ పీఠం నుంచి దించేందుకు కౌన్సిలర్లు అందరూ కూటమి కట్టారు. కౌన్సిలర్ల పదవీకాలం ఎనిమిది నెలలు మాత్రమే ఉండగా ఎమ్మెల్యేపై కౌన్సిలర్లు ఒత్తిడి తీసుకువచ్చి అవిశ్వాస తీర్మానం చేయించారు.
పక్క పార్టీ నుంచి వచ్చినవారికి గ్రీన్ కార్పెట్ పార్టీ సింబల్‌పై గెలిచిన కౌన్సిలర్‌కు దక్కని గౌరవం చీరాల టీడీపీలో వింత పోకడలు 16న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
చైర్మన్ పీఠంపై పలువురు కౌన్సిలర్లు మొగ్గు
చైర్మన్ కుర్చీ కోసం పలువురు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. పోటీపడుతున్న వారందరూ మొన్నటి వరకు వైఎస్సార్ సీపీలో ఉన్నవారే. టీడీపీ తరఫున గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావును కాకుండా వైఎస్సార్‌సీపీని వీడి కూటమికి మద్దతు పలికిన కౌన్సిలర్లే చైర్మన్ సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనిమిది నెలల పదవీకాలం మాత్రమే ఉన్నా అవిశ్వాసం పెట్టించి తిరిగి చైర్మన్‌గా కొత్తవారిని ప్రకటించేందుకు కూటమికి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు ఊవ్విళ్లూరుతున్నారు. చైర్మన్ పీఠం కోసం క్యాంపు రాజకీయాలు.. ప్రలోభాలు.. టూర్లు అంటూ కౌన్సిలర్లను కొద్దిరోజులపాటు తిప్పారు. అయితే రేసులో ఉన్నవారంతా మిగిలిన కౌన్సిలర్లను తమకు మద్దతుగా ఓటు వేస్తారా అనేది ఆశావహుల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంది. మే14న అవిశ్వా సం జరగగా అప్పటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు కౌన్సిల్ సమావేశాలను నిర్వహించలేదు. ఈనెల 16న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటన రాగా చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా... ఓటింగ్ నిర్వహిస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆశావహుల ఆశలు ఫలిస్తాయా.. ఫెయిల్ అవుతాయానేది సందిగ్దంలో ఉంది.