
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
తెనాలి రూరల్: దురలవాట్లకు బానిసలై జల్సాలకు డబ్బు కోసం గంజాయి విక్రయిస్తున్న నలుగురును రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఆర్. ఉమేష్ వివరాలను వెల్లడించారు. రూరల్ పరిధిలోని జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహ సముదాయం వద్ద గంజాయి విక్రేతలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ ఆనంద్, సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసినట్లు చెప్పారు. డెప్యూటీ తహసీల్దార్ కేవీఎస్ ప్రసాద్, పెదరావూరు, జగ్గడిగుంటపాలెం వీఆర్వోల సమక్షంలో కఠెవరం గ్రామానికి చెందిన ముక్కాల ప్రకాశరావు, పెదరావూరు పెదమాలపల్లెకి చెందిన దర్శి ప్రదీప్‌కుమార్, చినపరిమి రోడ్డులో ఉండే నలిగల శివ నాగరాజు, తెనాలి రైల్వే క్వార్టర్స్‌కు చెందిన మెరుగుమాల ప్రశాంత్‌కిరణ్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరంతా దురలవాట్లకు బానిసలైనట్లు తెలిపారు. విజయవాడకు చెందిన ఇమ్మానుయేలు నుంచి రూ 5వేలు, రూ.10వేలకు గంజాయి కొనుగోలు చేసి బస్టాండ్, రైల్వేస్టేషన్, తెనాలి పరిసర గ్రామాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న ఇమ్మానుయేలుపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. గత రెండు నెలల్లో గంజాయి కేసుల్లో పది మందిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్‌ఐ కె. ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, కానిస్టేబుళ్లు డి. రవి, బీహెచ్. సుబ్బారెడ్డి, లంక వరప్రసాద్, ఓంకార్ కపూర్ నాయక్ పాల్గొన్నారు.