
తిరగబడ్డ రైతుబిడ్డ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండోవిడత భూసేకరణలో ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత సెగ తగిలింది. సొంత సామాజిక వర్గానికి చెందిన రైతులే తిరగబడటంతో ఒక అడుగు వెనక్కి వేసింది. బుధవారం జరిగిన కేబినేట్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసింది. రైతులతో చర్చించి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకుంటామంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది.
పొంతన లేని లెక్కలు
ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు గ్రామాల్లో జరుగుతున్న తీరుకు సంబంధం లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పూలింగ్ పేరుతో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. పైగా ప్రభుత్వం కూడా ఎక్కడ భూమి తీసుకుంటుందో.. ఏ గ్రామాల్లో ఎంత అవసరమో చెప్పకుండా ఏకంగా గెజిట్ విడుదల చేసింది. ముందు ప్రకటించిన గ్రామాల్లోనే కాకుండా తాడికొండ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా గ్రామసభలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే.. పరోక్షంగా లక్ష ఎకరాలకు పైగా భూసమీకరణ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తలాతోక లేని అభిప్రాయ సేకరణ
తాడికొండ మండలంలోని మూడు గ్రామాల్లో 7,256 ఎకరాలు, తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాల్లో 10,878, అమరావతి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో 19,504, పెదకూరపాడు మండలంలోని రెండు గ్రామాల్లో 4,586 కలిపి 42,226 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించి గ్రామ సభలు నిర్వహించారు. నోటిఫికేషన్ కూడా వీటికి సంబంధించి విడుదల అయింది. అయితే గెజిట్‌తో సంబంధం లేకుండా అభిప్రాయ సేకరణ పేరుతో తాడికొండ మండలంలో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఈ సభలకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సమీకరణకు భూములివ్వబోమని తెగేసి చెప్పారు. వినతిప్రతం కూడా అందజేశారు. భూ బాగోతంపై రైతులు బేజాత్పురం, రావెల గ్రామ సభల్లో ప్రశ్నించినప్పటికీ ఎమ్మెల్యే, ఆర్డీవోలు మాట దాటవేత ధోరణే తప్ప సమాధానం చెప్పలేదు. నోటిఫికేషన్‌కు ముందు జరిపిన గ్రామ సభలకు సంబంధం లేకుండా గత గురువారం తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో, తర్వాత రోజు ఫణిదరం, దామరపల్లి, బండారుపల్లి గ్రామాల్లో సభలు నిర్వహించారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో రైతులు ఏకంగా అడ్డం తిరిగారు. తాము భూములిచ్చేది లేదంటూ ‘ఎమ్మెల్యే గో బ్యాక్’ అంటూ నినాదాలు హోరెత్తించారు. దీంతో అధికారులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మధ్యలోనే వెనుతిరిగారు.
రెండో విడత భూ సమీకరణపై వెనక్కి తగ్గిన కూటమి ప్రభుత్వం రాజధాని రైతుల వ్యతిరేకతతో కేబినేట్ నిర్ణయం వాయిదా
సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత
సొంత సామాజిక వర్గమే బాబుకు ఎదురు తిరగడంతో ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇప్పటికే తీసుకున్న 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసి మేలు చేస్తావనుకుంటే మరోసారి సమీకరణ పేరుతో నోళ్లు కొడతారా ? అంటూ గ్రామాల్లో రైతులు దుర్భాషలాడుతున్నారు. భూములు ఇచ్చేది లేదంటూ గ్రామాల్లో మైక్ ప్రచారం చేయడం సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

తిరగబడ్డ రైతుబిడ్డ