
ఏదీ.. అన్నదాత సుఖీభవ ?
● రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం ● బీమా, పరిహారమూ నిల్ ● వర్షాలు లేక, గిట్టుబాటు దక్కక రైతులు అవస్థలు
చీరాల: అన్నదాత సుఖీభవం పథకం అదిగో ఇదిగో అంటూ కాలం వెల్లదీస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాది దాటిపోయినా రైతులకు ఎలాంటి సాయం చేయకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. గత ఎన్నికల్లో రైతుల ఓట్లు కొల్లగొట్టి అధికారం చేపట్టిన వాస్తవాన్ని కూటమి నాయకులు విస్మరించారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. ఏడాది కాలంగా సరైన వర్సాలు లేవు, పంటలు పండలేదు, అర కొరగా వచ్చిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల బాగోగులు పట్టించుకోవాల్సిన సర్కారు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంతి చంద్రబాబుచేసిన ప్రకటనలకే దిక్కులేకుండా పోయింది.
రూ. 480 కోట్ల పెట్టుబడి సాయం హుష్‌కాక్..
మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ పథకం ఎగ్గొట్టారు. ప్రస్తుతం ఇదిగో అదిగో అంటూ రైతులను ఏడాది కాలంగా ఊరిస్తూ వస్తున్నా ఇప్పటికీ అతీగతి లేదు. ఏటా రూ. 20 వేలు ఇస్తామంటూ ప్రకటించినా, జిల్లా రైతులకు మొదటి ఏడాది ఇవ్వాల్సిన మొత్తం రూ. 480 కోట్లు పెట్టుబడి సాయం ఎగొగ్గట్టేశారు. రెండో ఏడాదైనా ఇస్తారని రైతులు ఆశలు పెట్టుకున్నా ఇవ్వడం లేదు. మే అన్నారు, తర్వాత జూన్ 12, 20 అన్నారు. ఆ తర్వాత జూన్ ఆఖరులోపు అంటున్నారు. మళ్లీ జులై ఆఖరికి అని ఊసూరు మనిపిస్తున్నారు. సీఎం, మంత్రుల ప్రకటనలకూ దిక్కులేకుండా పోయింది. పీఎం కిసాన్, కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.14 వేలు ఇస్తామనా ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. కనీసం రూ. 14 వేలు ఇచ్చినా గతేడాది జిల్లాలో ఉన్న 2.40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 400 కోట్లు మేర జమ అయ్యేవి. ఈ సారి పీఎం కిసాన్ కింద మొదటి విడత ఇవ్వాల్సిన సొమ్ము కూడా జాప్యం చేస్తుండటంతో రైతులు కష్టాల్లో కూరుకుపోతున్నన పరిస్థితి నెలకొంది.
రైతుల అవస్థలు..
అన్నదాత సుఖీభవతోపాటు పంటల బీమా పథకం కింద ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. మరోవైపు పంటలు పండక అప్పుల పాలై పిల్లల చదువులు, పెళ్లిళ్లు భారమై ఆత్మహత్య చేసుకునన రైతు కుటుంబాలకు కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదు. గత జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు దాదాపు పదుల సంఖ్యలో రైతులు వివిధ రూపాల్లో బలవన్మరణ పొందినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెల్లినా స్పందించక పోవడంతో బాదితుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక గత ఖరీఫ్, రబీలో పంటలు దారుణంగా దెబ్బతినడంతో కంటి తుడుపు చర్యగా కరువు మండలాలను ప్రకటించేసి ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో పైసా ఇవ్వకుండా ప్రభుత్వం రిక్తహస్తం చూపించారు. అకాల వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలకు కూడా ఇన్‌పుట్ ఇవ్వకుండా దాట వేశారు. పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ లేదు. వడ్డీ రాయితీ కరువై అన్నదాత దిక్కు చూస్తున్నా కూటమి ప్రభుత్వం కరుణించే పరిస్థితి కనిపించడం లేదు.