
విద్యతోనే పేదల అభివృద్ధి సాధ్యం
యద్దనపూడి: విద్యతోనే పేదల అభివృద్ధి సాధ్యం అవుతుందని వక్తలు పేర్కొన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ కుమారుడు షేక్ బాపూజీ కళా బృందంచే అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను బుర్ర కథ ప్రదర్శించారు. ముందుగా భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని రమేష్ మాట్లాడుతూ విద్య ద్వారానే పేదల అభివృద్ధి సాధ్యం అన్నారు. పేద ప్రజలు తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలన్నారు. తమ పిల్లలు మత్తు పానీయాలకు, దుర్వ్యసనాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు. నియోజకవర్గ ఎస్‌సీఆర్‌పీ సొసైటీ కన్వీనర్ రాము మాట్లాడుతూ మన ఓటు మనకే వేసుకుని రాజ్యాధికారంలోకి రావాలన్నారు. సీపీఐఎంఎల్ రెడ్‌స్టార్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వరంగాల సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ పేదలకు అన్యాయం చేస్తుందన్నారు. ప్రధాన కథకుడు షేక్ బాపూజీ అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రన బుర్రకథ రూపంలో చెప్పి ప్రజలను అలరించారు. కార్యక్రమంలో దయారత్నం, డీఎస్ బాబు.రాజేంద్రప్రసాద్, ఎస్‌ఎ సలీంబాబు, రాహేలు గ్రామ యువకులు వందనం, రవి, రత్న కిషోర్, కిషోర్ బాబు, ఆనంద్, విద్యార్థులు కావ్య, అనన్య, సాత్విక పాల్గొన్నారు.
అనంతవరంలో సీతారామరాజు
జీవిత చరిత్ర బుర్రకథ
పాల్గొన్న బుర్రకథ పితామహుడు
షేక్ నాజర్ కుమారుడు షేక్ బాపూజీ