
పొగాకు కొనుగోలులో పచ్చపాతం
● పార్టీ నాయకులను ఉద్ధరించడానికేనా కొనుగోలు కేంద్రాలంటున్న రైతులు ● స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పొగాకు కొనుగోలు ● అధికారులకు కనిపించని సన్న, చిన్నకారు రైతులు ● రైతులు ఆశించినంతగా లేని పొగాకు కొనుగోళ్లు ● ప్రభుత్వ చర్యలతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషణ
టీడీపీ నాయకుల సిఫార్సుల మేరకే రైతులకు ఫోన్ మెసేజ్‌లు
పర్చూరు (చినగంజాం): ఆరుగాలం కష్టించి పనిచేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులు ప్రభుత్వంతో కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు, కౌలు రైతుల ఆందోళనల మధ్య ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆశించినంతగా కొనుగోళ్లు జరగడం లేదనే విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేతల సిఫార్సు ఉంటేనే కొనుగోలు
ప్రభుత్వం ద్వారా పొగాకు సేకరణ చేస్తున్న ఏపీ మార్క్‌ఫెడ్, ఏఎంసీ, డీసీఎంఎస్ సిబ్బంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని, ఎక్కడికక్కడ కొర్రీలు పెడుతూ సక్రమంగా కొనుగోళ్లు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొగాకు కొనుగోలు కేంద్రాల్లో టీడీపీ నాయకుల సిఫార్సుల మేరకే కొనుగోలు జరుగుతుందనే ఆరోపణలున్నాయి. పొగాకు పండించిన రైతులు అధికారుల సూచనల మేరకు తమ పంట వివరాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఆ రైతులకు మెసేజ్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాల వద్దకు పొగాకు ఎప్పుడు తీసుకొని రావాలనే విషయాన్ని ముందుగా అధికారులు తెలియజేయాల్సి ఉంది. అయితే తమకు మెసేజ్‌లు అందడం లేదని, టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికి మాత్రమే మెసేజ్‌లు వస్తున్నాయని, అది కూడా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే కొనుగోలు కేంద్రాల్లో అధికారులు మెసేజ్‌లు పెడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న రైతులు పొగాకు బేళ్లను సిద్ధం చేసుకున్నా మెసేజ్‌లు రాకపోవడంతో రోజుల తరబడి ఎదురు చూస్తున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే సమక్షంలో ఇటీవల కొద్దిపాటి వివాదం కూడా తలెత్తినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఒక టీడీపీ నాయకుడు తాము చెప్పిన వారికే మెసేజ్‌లు పెట్టాలంటూ ఎమ్మెల్యే వద్ద తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
అధికారుల కుంటి సాకులు
రైతులు తెచ్చిన పొగాకును పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా అధికారులు కుంటిసాకులు చెబుతూ బేళ్లను వెనక్కి పంపేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులకు మెసేజ్‌లు రావడమే గగనమైతే పేర్లు వచ్చిన రైతుల పొగాకు 20 శాతం మాత్రమే కొనుగోలు చేసి మిగిలిన దానిలో తేమశాతం ఎక్కువగా ఉందనో, నాణ్యత సక్రమంగా లేదనే సాకులు చెబుతూ పంపిస్తున్నారు. ఒకే భూమిలో పండించిన ఒకే పంటను నాణ్యత కొరవడిందంటూ తిప్పి పంపించడం ఎంత వరకు సమంజసమంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చేందుకు పొగాకు బేళ్లను కట్టాల్సి ఉండగా అందుకోసం బేలుకు రూ.150, రవాణా రూ.70 మొత్తం రూ.220 ఖర్చవుతుండగా మళ్లీ కొనుగోలు కేంద్రంలో అధికారులు తిప్పి పంపితే అదే ఖర్చు ఇంటి దాకా తీసుకెళ్లేందుకు అవుతోంది.
ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు
సిద్ధమవుతున్న రైతులు
పొగాకు కొనుగోలు కేంద్రాల్లో అధికారులు బేళ్లను ఏదో ఒక సాకు చెప్పి కొర్రీలు పెట్టి తిప్పి పంపుతుండటంతో తమ పంటను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో రూ.12 వేలు పలుకుతున్న పొగాకును ప్రైవేటు వ్యక్తులు అతి తక్కువగా రూ.8500లకే కొనుగోలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు కొందరు దళారులుగా మారి రైతులను మోసానికి గురి చేస్తున్నారు.
పర్చూరు నియోజకవర్గంలో పొగాకు కొనుగోలు పరిస్థితి
మండలం పండించిన పంట రైతుల వద్ద
రైతులు దిగుబడి నిల్వ
(క్వింటాలు) (క్వింటాలు)
ఇంకొల్లు 1892 1,05,990 1,00,508
యద్దనపూడి 1950 1,17,500 1,17,000
మార్టూరు 701 27,349 1927
కారంచేడు 1852 97950 5650
పర్చూరు 4359 3,11,838 12,138
చినగంజాం 290 16629 315
ఆశించిన స్థాయిలో సాగని
కొనుగోళ్లు
పొగాకు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు 15 శాతం మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. చిలకలూరిపేట ప్రాంతంలో ఏర్పాటుచేసిన కేంద్రంలో గడచిన వారంలో అతి తక్కువగా 73.22 మెట్రిక్ టన్నుల పొగాకు కొనుగోలు జరిగింది. పంగులూరు, పర్చూరుల్లోని కేంద్రాల్లో అతి తక్కువగా కొనుగోలు జరిగింది. మొత్తం 11 కొనుగోలు కేంద్రాల్లో 2 వేల మెట్రిక్ టన్నులకు మించి పొగాకు కొనుగోలు జరగలేదు. పొగాకు కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకొచ్చిన పొగాకులో 20 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని తిప్పి పంపించేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దాంతో ముందుగా మెసేజ్‌లు వచ్చిన కొందరు రైతులు తమ పలుకుబడి ఉపయోగించి ప్రైవేట్ మార్కెట్‌లో కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్ వాళ్లకే అమ్ముతున్నట్లు సమాచారం.

పొగాకు కొనుగోలులో పచ్చపాతం