బుల్లెట్‌ బైక్‌ దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ బైక్‌ దొంగల అరెస్ట్‌

Jul 16 2025 9:07 AM | Updated on Jul 16 2025 9:07 AM

బుల్లెట్‌ బైక్‌ దొంగల అరెస్ట్‌

బుల్లెట్‌ బైక్‌ దొంగల అరెస్ట్‌

● అందరూ బీటెక్‌ విద్యార్థులే.. ● 16 బుల్లెట్‌లు, స్కూటర్‌, రూ.25.20 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ● యూట్యూబ్‌ సెర్చ్‌ చేసి దొంగతనానికి ప్లాన్‌ ● కేసు ఛేదించిన అద్దంకి సీఐ బృందానికి ఎస్పీ ప్రశంసలు

అద్దంకి రూరల్‌: యూ ట్యూబ్‌ మంచే కాదు చెడూ చేస్తుందనడానికి బీటెక్‌ విద్యార్థులు దొంగలుగా మారిన ఘటనే ఉదాహరణ. చెడు వ్యసనాలకు బానిసలై, సులువుగా డబ్బు సంపాదించాలని ఆశ వారిని కటకటాల పాల్జేసింది. ఒంగోలులో బీటెక్‌ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఒక ముఠాగా ఏర్పడి ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుల్లెల్‌ బైక్‌లను దొంగిలించారు. అద్దంకి సీఐ బృందం కేసును ఛేదించి దొంగలను పట్టుకున్నారు. చీరాల డీఎస్పీ మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. అద్దంకికి చెందిన పల్లా సాయిరాం, పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన నార్లగడ్డ గోవిందరాజు, నెల్లూరు జిల్లా కావలి మండలం చౌదరిపాలెం గ్రామానికి చెందిన కోడెల పవన్‌కుమార్‌, ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం యోడ్లూరిపాడు గ్రామానికి చెందిన దివీ వేణుగోపాల్‌, దర్శి మండలం ఈస్ట్‌ వీరాయపాలెంకు చెందిన రాయపూడి వసంత్‌కుమార్‌, ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కొత్త పెండ్యాల గ్రామానికి చెందిన జీనెపల్లి నరేంద్రవర్మ, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం, ఆలూరి గ్రామానికి చెందిన అక్కుల వెంకట సాయిరెడ్డిలు ఒంగోలులోని ఓ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. చెడు వ్యవసనాలకు బానిసైన వీరు సులువుగా డబ్బు సంపాదించే మార్గం చెప్పాలని నిందితుడు గోవిందరాజును సలహా అడిగారు. యూట్యూబ్‌లో సెర్చ్‌చేసి బుల్లెట్‌ బండ్లు దొంగతనం చేసే విధానాన్ని అందరికీ చూపించాడు. ఈ వీడియో చూసి దానిప్రకారం బుల్లెట్‌ బండ్లను మాత్రమే దొంగలించటం ప్రారంభించారు.

శింగరకొండ తిరునాళ్లలో మొదటి దొంగతనం

మొదటగా అద్దంకి మండలం శింగరకొండ తిరునాళ్ల రోజు 99 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం వద్ద బుల్లెట్‌ బండిని దొంగిలించారు. నామ్‌ హైవేపై పెట్టిన బండ్లను, అద్దంకి పట్టణంలోని చినగానుగపాలెం, కాకానిపాలెం, దామావారిపాలెం, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద, సింగరకొండ గుడి వద్ద కలిపి అద్దంకి స్టేషన్‌ పరిధిలో 9 బుల్లెట్‌ బైక్‌లను తస్కరించారు. జె.పంగులూరు పరిధిలో బుల్లెట్‌, స్కూటీ, చిలకలూరిపేట స్టేషన్‌ పరిధిలో మూడు బుల్లెట్‌లు, నరసరావుపేట పరిధిలో ఒక బుల్లెట్‌, మద్దిపాడు, మేదరమెట్లల్లో ఒక్కొక్కటి మొత్తం 16 బుల్లెట్‌లు, ఒక స్కూటీ దొంగిలించారు. మొదటి నిందితడు పల్లా సాయిరాం, తోటి నిందితులు కొన్ని వాడుకుంటూ మిగిలినవి అమ్ముకుందామని అద్దంకి బ్రహ్మానందం కాలనీలోని పాడుపడ్డ బిల్డింగ్‌లో దాచిపెట్టారు. అద్దంకి పరిసర ప్రాంతాల్లో భారీగా బుల్లెట్‌ బైక్‌లు చోరీకి గురికావటంతో ఎస్పీ తుషార్‌డూడీ ఆదేశాల మేరకు అద్దంకి సీఐ సుబ్బరాజు బృందం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాకచక్యంగా దొంగలను మంగళవారం అరెస్టు చేసింది. వారినుంచి 16 బుల్లెట్లు, స్కూటీ, రూ.25.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అద్దంకి సీఐ సుబ్బరాజు, ఏఎస్సై బి.వసంతరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ జి.అంకమ్మరావు, కానిస్టేబుల్‌లు వి.బ్రహ్మయ్య, పి.బ్రహ్మయ్య, ఎం. వెంకట గోపయ్యలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement