
పుర ప్రథమ పౌరుడి ఎన్నిక నేడు
● నేడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ● ప్రధాన పోటీలో పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు
చీరాల: పట్టణ పుర పౌరుడి ఎన్నికకు బుధవారం ముహూర్తం ఖరారైంది. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గిన రెండు నెలల తర్వాత బుధవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్‌గా ఎవరి పేరు ఖరారు చేస్తారనేది సందిగ్ధంలోనే ఉంది. చైర్మన్ కుర్చీకి ప్రధాన పోటీలో పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు పేర్లు వినిపిస్తున్నాయి. ముగ్గురిలో కూటమికి ఎవరు ఎక్కువగా ‘తూకం’ పెడతారో వారిదే పైచేయి అయ్యేలా ఉంది. చీరాల రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఏ చిన్న వ్యవహారం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం వెళ్లిపోతుంది. ఈసారి అయినా గట్టి పట్టుదలతో చైర్మన్ అభ్యర్థిని బయటకు పొక్కనీయడం లేదు. దీనికి తోడు ఎమ్మెల్యేతోపాటు ఆయన తనయుడు మహేంద్ర ఎవరిని చైర్మన్ చేయాలనేది మల్లగుల్లాలు పడుతున్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఎలా ఉంటాయి. చీరాల నైసర్గిక, ఆర్థిక వనరులపై ఒక నిర్ణయానికి వస్తున్నారు. రాత్రికి పార్టీలో ముఖ్యులతో ఎమ్మెల్యే చర్చించుకున్నారు. ఈ దశలో మహిళా కోట అడిగితే అప్పుడు ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చారు.
టీడీపీ కౌన్సిలర్‌కు గౌరవం దక్కుతుందా..?
టీడీపీ తరఫున గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావును కాకుండా వైఎస్సార్ సీపీని వీడి కూటమికి మద్దతు పలికిన కౌన్సిలర్లే చైర్మన్ సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనిమిది నెలల పదవీకాలం మాత్రమే ఉన్నా అవిశ్వాసం పెట్టించి తిరిగి చైర్మన్‌గా కొత్తవారిని ప్రకటించేందుకు కూటమికి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు ఊవ్విళ్లూరుతున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించనున్నారు. డీఆర్వో, ఆర్డీఓ పర్యవేక్షణలో చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు చైర్మన్, 12 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు. మరి కొద్ది గంటల్లో సీల్డ్ కవర్‌లో ఎవరి పేరు ఉంటుందో తేలనుంది.
కౌన్సిలర్ల చూపు ఎవరి వైపు..?
చీరాల మున్సిపల్ ఎన్నికల్లో 33 వార్డుల్లో ఎక్కువ శాతం వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు విజయం సాధించారు. టీడీపీ నుంచి ఒక్కరు మాత్రమే గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి 9 మంది ఉన్నారు. 2024లో ఎన్నికల అనంతరం వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు కూటమికి మద్దతు పలికారు. చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించిన తర్వాత చైర్మన్ కుర్చీని అధిరోహించేందుకు పోటీపడుతున్న వారందరూ మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీలో ఉన్నవారే. అయితే రేసులో ముగ్గురు పేర్లు ఉన్నాయి. తమ తమ బలాలు నిరూపించుకునేందుకు కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిలర్లు ఎవరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారనేది వేచి చూడాలి.