
మంత్రి, అధికారులు కుమ్మక్కయారు
● 18 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు అంటూ మోసం ● కారుచౌకగా భూములు కొట్టేయాలని చూస్తున్న వైనం ● వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు
బల్లికురవ: సోలార్ ప్రాజెక్ట్ కోసం కారుచౌకగా భూములు కొట్టేయాలని మంత్రి, అధికారులు కుమ్మక్కయారని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు ధ్వజమెత్తారు. సోమవారం రాత్రి మండలంలోని కొప్పరపాలెంలో గ్రామంలో గ్రామ బూత్ కమిటీలను ఎకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఎన్నికల హమీలు నెరవేర్చకుండా ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లోని ఎస్‌ఎల్ గుడిపాడు, కుందుర్రు, మావిళ్లపల్లి, మక్కెనవాపాలెం గ్రామాల్లోని 18 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నామంటూ 3 నెలలుగా మంత్రి అధికారులతో కలిసి తక్కువ ధరకే భూములు కాజేయాలని కుట్ర పన్నారని చెప్పారు. ఆ భూములు కోల్పోతే రైతులకు మనుగడే లేదని కృష్ణబాబు వివరించారు. ఈ విషయమై రైతులకు సోమవారం గ్రీవెన్స్‌లో వినతి పత్రాలు అందజేసినట్లు చెప్పారు. కొప్పరపాలెం గ్రామ, బూత్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా మాగులూరి శివారెడ్డి, గొర్రెపాటి దానయ్య, యర్రకుల వెంకటేశ్వర్లు, కొయ్యలమూడి వెంకటేశ్వర్లు మరో 30 సభ్యులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ప్రత్తిపాటి అక్కయ్య ఎస్సీ సెల్ మహిళాధ్యక్షురాలు, కోయలమూడి శింగయ్య స్థానిక నేతలు ఆల్గొన్నారు.